World Cup 2023: తన్నుకుంటున్న పాకిస్థాన్ లెజెండరీ క్రికెటర్లు.. బాబర్ అజామ్ మేటర్‌లో రచ్చ రచ్చ!
టీమిండియాపై పాకిస్థాన్ ఓడిపోడాన్ని ఆ జట్టు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ నవ్వులపాలవుతున్నారు.

icc world cup 2023 mohammed yousuf slams shoaib malik and wasim akram for their remarks on babar azam
పాకిస్థాన్ ఈ వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఒక్కటే మ్యాచ్ ఓడిపోయింది. అది ఇండియాపై. నిజానికి ఈ వరల్డ్‌కప్ ఆట బాగానే ఉంది. ఇండియాపై మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లు దెబ్బకొట్టాయి. బుమ్రా దెబ్బకు ప్రధాన బ్యాటర్లు దొరికిపోయారు. దీంతో జట్టు కోలుకోలేకపోయింది. ఓడిపోయింది ఇండియాపై కాబట్టి సాధారణంగానే ఆ జట్టు అభిమానులకు, మాజీలకు కోపం వస్తుంది. ఇందులో ఎలాంటి తప్పు లేకున్నా పాక్ మాజీలు మాత్రం ఈ ఓటమి విషయంలో కాస్త అతిగా రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కెప్టెన్ బాబర్ అజామ్‌ని ఆ పొజిషన్ నుంచి పీకిపారేయండంటూ కామెంట్స్ చేస్తుండడం వారి ఫ్రస్ట్రెషన్‌ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.
కెప్టెన్‌గా బాబర్ అజామ్ పనికిరాడని.. అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయలేడని పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని గతంలో అనేకసార్లు చెప్పానని.. మళ్లీ అదే చెబుతున్నానన్నాడు. బాబర్ ప్లేస్‌లో షాహీన్ అఫ్రిదిని కెప్టెన్ చేయాలని.. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో లాహోర్ తరుఫున లీడర్‌గా షాహీన్ సత్తా చాటాడని మాలిక్ గుర్తు చేశాడు. అటు పాక్ లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ సైతం బాబర్ విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కోహ్లీ దగ్గరకు వెళ్లి ఆటోగ్రఫ్ చేసిన టీషర్ట్ తీసుకోవడంపై మండిపడ్డాడు. తన అంకూల్ కొడుకు కోసం బాబర్ అలా చేశాడు. అయితే అది సమయం కాదు అని.. కోహ్లీ దగ్గర మరోసారి అలా టీషర్ట్ తీసుకోవచ్చంటూ విమర్శించాడు.
మాలిక్, వసీం వ్యాఖ్యలను ఆ జట్టు మాజీ ఆటగాడు యూసుఫ్ వ్యతిరేకించాడు. ముఖ్యంగా మాలిక్ చేసిన కామెంట్స్‌ను తప్పుబట్టాడు. ప్రస్తుతం వరల్డ్‌కప్ జరుగుతూనే ఉందని.. ఇంకా ముగియలేదన్నాడు యూసుఫ్. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల జట్టు డిస్టర్బ్ అవుతుందన్నాడు. మాలిక్ అలా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న వసీం అతడిని ఆపకపోవడాన్ని కూడా యూసుఫ్ తప్పుపట్టాడు. ఇమ్రాన్ ఖాన్ 1983, 1987 ప్రపంచకప్‌ల్లో కెప్టెన్‌గానే ఉన్నాడని.. అయినా అతను కప్ సాధించింది 1992లోనేనన్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇలా బాబర్ విషయంలో పాక్ మాజీలు రెండుగా వీడిపోయి తిట్టుకుంటున్నారు.