హైబ్రిడ్ మోడల్ కే ఐసీసీ, మొగ్గు తుది నిర్ణయం అప్పుడే
ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ ఇంకా తేలలేదు. ఈ విషయంలో భారత్ పాకిస్థాన్ తగ్గేదెలా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.షెడ్యూల్, వేదికలపై చర్చించేందుకు ఫైనల్ మీటింగ్ 29న జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ ఇంకా తేలలేదు. ఈ విషయంలో భారత్ పాకిస్థాన్ తగ్గేదెలా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.షెడ్యూల్, వేదికలపై చర్చించేందుకు ఫైనల్ మీటింగ్ 29న జరగనుంది. నిజానికి ఈ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ వేదికగా జరగాలి. కానీ భారత్ పాకిస్థాన్‌లో పర్యటించేందుకు సిద్ధంగా లేదు. మరోవైపు భారత్ ఆడే మ్యాచ్ లను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకోవట్లేదు.ఈ నేపథ్యంలో ఈ టోర్నీపై ఏదో ఒకటి తేల్చేందుకు ఐసీసీ సిద్ధమైంది.
29న జరిగే మీటింగ్ లో ఐసీసీ అనేక సమస్యలపై చర్చించనుంది. భద్రత సమస్యలు, అలాగే హోస్టింగ్ హక్కులు మరియు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలపై ఐసీసీ అందరి అభిప్రాయాలు సేకరించనుంది. ఇక భారత్-పాక్ ఆడే మ్యాచులు ఎక్కడ నిర్వహించాలి అన్న దానిపై నిపుణులతో కూడా మాట్లాడనుంది. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించడం సాధ్యమవుతుందా? హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించకపోతే పరిస్థితి ఏంటన్న దానిపై ఆ రోజే క్లారిటీ రానుంది. ఈ సమావేశంలో దాయాది దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
గ్రెగ్ బార్క్లే ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. డిసెంబర్ 1న పదవీవిరమణ చేసే ముందు అతని అధ్యక్షతన జరిగే చివరి సమావేశం ఇదే కావడం విశేషం. ఆ తర్వాత అతని స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా 1996లో ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుండటం ఇదే తొలిసారి. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను ఆధునికీకరించింది. అయితే 2009లో పాకిస్థాన్లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడి తర్వాత పాక్ కు వెళ్లేందుకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు అనుమతించడం లేదు. ఇక పాక్ భారత్ మధ్య పొలిటికల్ సమస్యలు కూడా ఉండటంతో భారత్ పాక్ గడ్డపై అడుగుపెట్టడం అసాధ్యంగానే కనిపిస్తుంది. ఏదేమైనా 29న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.