Tiger Abortion : పెద్ద పులి గర్భంతో ఉన్నప్పుడు మనిషి చూస్తే అబార్షన్ అవుతుందా…?
మన పురాణాల నుంచి కూడా పులి అంటే క్రూర జంతువు, ఒక క్రూర మృగం అనే ప్రచారం చూస్తూనే ఉన్నాం.
మన పురాణాల నుంచి కూడా పులి అంటే క్రూర జంతువు, ఒక క్రూర మృగం అనే ప్రచారం చూస్తూనే ఉన్నాం. ఏ జంతువు కనపడినా పులి చంపి తినేస్తుంది అని, మనిషి కనపడినా కూడా పులి వదిలే అవకాశమే లేదని చీల్చి చెండాడుతుంది అంటూ ఉంటారు. అసలు వాళ్ళు చెప్పేది నిజమేనా…? పులి నిజంగా క్రూర మృగమేనా…? అసలు కాదంటే కాదు అంటున్నారు పులిపై అధ్యయనం చేసిన నిపుణులు. పులి జీవితం చాలా అందంగా ఉంటుందని, చాలా సున్నితమైన జీవి పెద్ద పులి అంటూ చెప్తున్నారు. అందులో ఆసక్తికర విషయాలు కొన్ని చూద్దాం. ఇప్పుడు మన నల్లమల అడవుల్లోకి ప్రజలను అనుమతించకపోవడానికి కూడా బలమైన కారణం ఉందని అంటున్నారు.
సాధారణంగా ఇతర జంతువులు అన్నీ కూడా దాదాపుగా మనిషి కనపడినా ఏ అలజడి వచ్చినా సరే శృంగారం చేయడం మనం చూస్తూనే ఉంటాం. కాని పెద్ద పులి అలా కాదట. అడవుల్లో తిరిగే నిజమైన పెద్ద పులి, మనిషి కనపడితే అసలు శృంగారం చేయవట. ఆడ పులి మగ పులి కలవడానికి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి తోడు వెతుక్కుంటాయి అని, జులై నుంచి సెప్టెంబర్ చివరి వరకే అవి కలుస్తాయని, ఈ సమయంలో ఏ చిన్న అలజడి వినపడినా అవి కలిసే అవకాశమే లేదట. అలాగే పులి గర్భంలో ఉన్నప్పుడు మనిషి అలజడి గనుక పులికి తగిలితే కచ్చితంగా అబార్షన్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంత సున్నితంగా ఉంటుందట పులి జీవితం. అందుకే మన నల్లమల అడవుల్లో పులుల మేటింగ్ కోసం… జులై చివరి నుంచి సెప్టెంబర్ చివరి వరకు వైల్డ్ లైఫ్ సఫారీలను ఆపేస్తారట అధికారులు.
పులి మనిషిని తింటుందా.. ఇది కచ్చితంగా అబద్దం అంటున్నారు నిపుణులు. పులి ఎప్పుడూ కూడా మనిషిని తినే అవకాశమే ఉండదని, పులి ఆహారపు మెనూలో రెండు ప్రాణుల జీవులు ఏవీ లేవని, నాలుగు కాళ్ళ జీవులు కూడా పరిమాణంలో పెద్దగా ఉంటే పులి కచ్చితంగా తినే అవకాశమే లేదని, పులి వేటాడే సమయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది అని పులిపై పరిశోధనలు చేసిన నిపుణులు చెప్తున్నారు. కొమ్ములు ఉన్న జంతువులు, తనపై తిరిగి దాడి చేసే అవకాశం ఉన్న జంతువులను వేటాడే సమయంలో పులి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే దాడి చేస్తుంది. సులభంగా దొరికే వాటి మీదనే పులి దాడి చేసేందుకు ఆసక్తి చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పులి మనిషి ఆహారానికి అలవాటు పడే సమయం చాలా అరుదు అని… పులి వృద్దాప్యంలో ఉన్నప్పుడే ఆ పని చేస్తుందని, ఆ సమయంలో పులికి సులువుగా దొరికే ప్రాణి మనిషే అని, మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పులులు లేవట. కేవలం పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ అడవుల్లో మాత్రమే ఆ పులులు ఉన్నాయట. అందుకే అక్కడి ప్రజలు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. పులి ముందు నుంచి దాడి చేయదట. వెనుక నుంచే దాడి చేస్తుందట. అందుకే తల వెనుక ముఖం కనపడేలా మాస్క్ పెట్టుకుని అక్కడి ప్రజలు అడవుల్లో తిరుగుతారట.
పులి దాడి చేయని జంతువులు ఇవే.. పులి కొమ్ములు ఉన్న జంతువులతో పాటు… మగ అడవి పందిపై, ఎలుగు బంటిపై దాడి చేసే అవకాశమే లేదట. వాటికి బలమైన పళ్ళు ఉండటంతో పులి తనను తాను నాలుకతో నాక్కునే అవకాశం లేని చోట దాడి చేస్తే ప్రమాదం అని సెప్టిక్ అయి చనిపోయే ప్రమాదం ఉంటుందని దాడి చేయదట. దుప్పిపై కూడా దాడి చేయదని కేవలం జింకలపైనే దాడి చేసి తింటుందని నిపుణులు చెప్తున్నారు. ఒకసారి దాడి చేస్తే 20 కేజీల మాంసం తిని మళ్ళీ వారం పది రోజులు వేటకు వెళ్ళే అవకాశం లేదట.
మగ పులి పిల్లలు ఎందుకు తల్లికి దూరంగా: పులి తన సంతాన అభివృద్ధిలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వంశాన్ని కాపాడుకునే విషయంలో ఆడ పులి కఠినంగా వ్యవహరిస్తుందట. మగ పులి పిల్లలు వేటాడే వయసు వచ్చే వరకు వాటిని తన వద్ద ఉంచుకుని ఆ తర్వాత తరిమేస్తుంది. ఆ పిల్లలు కూడా తల్లి నుంచి చాలా దూరం వెళ్ళిపోతాయి. కారణం తల్లితో మేటింగ్ జరిగే అవకాశం ఉంటుందని లేదా తన తోటి ఆడ పులి పిల్లలతో మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా వెళ్ళిపోయి జీవితాన్ని సాగిస్తాయని నిపుణులు చెప్తున్నారు. తమకు ఇది సహజంగా వచ్చిన లక్షణమని, మనుషుల్లో మేనరికం సమస్యలు ఉన్నట్టే పులికి కూడా ఉన్నాయని అందుకే పులి జాగ్రత్తలు తీసుకుంటుంది అని నిపుణులు చెప్తున్నారు. ఇక పులి మరణించే సమయంలో కూడా కొండ ప్రాంతాలకు వెళ్లి మరణిస్తుంది గాని ఇతర జీవులకు కంట పడేలా ఉండదని చెప్తున్నారు. అందుకే ఇప్పటి వరకు వృద్దాప్యంలో చనిపోయిన పులిని ఎవరూ చూసిన దాఖలాలు లేవట.
అయితే అడవుల్లో ఉండే పులులకు జంతు ప్రదర్శనశాలల్లో ఉండే పులులకు చాలా తేడా ఉంటుంది. జూలో పెరిగే పులులు మనుషులకు అలవాటు పడిపోతాయి.