Bala Krishna: సంక్షోభ సమయంలో బాలయ్య నాన్ సీరియస్.. టిడిపికి కొత్త తలనొప్పి
అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే చర్చ జరుగుతోంది. చంద్రబాబులేని తెలుగుదేశం శాసన సభా పక్షాన్ని ధాటిగా నడిపిస్తారని భావించిన తమ్ముళ్లు బాలయ్యను చూసి అయ్యో అంటున్నారు.
అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే చర్చ జరుగుతోంది. చంద్రబాబులేని తెలుగుదేశం శాసన సభా పక్షాన్ని ధాటిగా నడిపిస్తారని భావించిన తమ్ముళ్లు బాలయ్యను చూసి అయ్యో అంటున్నారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను ఖండఖండాలుగా ఖండించి, ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, మెప్పుపొందాల్సిన బాలయ్య ఇలా అల్లరి చేష్టలతో అప్రతిష్ఠ పాలు అవుతున్నాడు. వైసీపీ ఎమ్మెల్యేల వెటకారాలను పక్కనపెడితే, బాలకృష్ణకు ఇది మంచి అవకాశం. నాయకుడిగా తనను తాను నిరూపించుకునే సందర్భం. చంద్రబాబు సభలో వున్న టైంలో పెద్దగా సభకు హాజరయ్యేవారు కాదు బాలయ్య. సినిమా షూటింగ్ లతో హైదరాబాద్ లోనే బిజీగా వుండేవారు. అప్పుడప్పుడు అలా వచ్చి, ఇలా అటెండెన్స్ వేయించుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టై జైల్లో వున్నారు. పార్టీకి పెద్దదిక్కులేరు. టీడీపీలో గెలిచిందే కొందరు ఎమ్మెల్యేలు. అందులోనూ కొందరు పక్క పార్టీతో టచ్ లో వుంటున్నారు. వున్న కొద్దిమందితో 150మందికి పైగా వున్న వైసీపీ దళంతో పోరాడాలి. అన్నగారి వారసుడిగా, పార్టీలో కీలకమైన నేతగా, అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీస్తాడని ఆశించడం సహజం. కానీ బాలయ్య వ్యవహారం అందుకు భిన్నంగా ఉంది. నందమూరి లెవెల్ ఆఫ్ అటాకింగ్ మిస్సయ్యింది.
బాలకృష్ణ జీవితం తెరిచిన పుస్తకం. భోళా మనిషి. ఆనందాన్ని దాచుకోలేరు. ఆగ్రహాన్నీ నిగ్రహించుకోలేరు. సెల్ఫీ అడిగితే చెంప చెళ్లు మనిపిస్తారు. చిరాకులో వుంటే చీల్చి చెండాడుతారు. నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారు. అవి నీతులైనా, బూతులైనా కుండబద్దలుకొట్టినట్టే డైలాగులు దంచేస్తారు. ప్లేస్ ఏదైనా, సెంటర్ ఏదైనా, షూటింగ్ స్పాటయినా, సినిమా ఫంక్షనైనా తనకు తోచిందే మాట్లాడతారు. చెయ్యాల్సిందే చేస్తారు. మాటలు తడబడినట్టు అనిపించినా, మనసులో ఏదుంటే అదే కక్కేస్తారు. అవతలివాళ్లు ఏమనుకుంటారు, మనం మాట్లాడుతున్నది కరెక్టేనా..అనే ఆలోచనేమీ చెయ్యరు. మాట్లాడిన తర్వాత ఆలోచించరు. ఇలా కాక్ టైల్ లాంటి బాలయ్య క్యారెక్టర్ ను అభిమానులు బాగానే ఎంజాయ్ చేస్తారు. కొట్టినా, తిట్టినా, మా బాలయ్యే కదా అని మరింతగా అభిమానిస్తారు. కానీ అదంతా టర్మ్స్ అండ్ కండీషన్స్ బాగున్నప్పుడు. పరిస్థితులన్నీ చక్కగా వున్నప్పుడు. కానీ ఇప్పుడలా కాదు. చంద్రబాబు జైలుకెళ్లారు. పార్టీ కష్టకాలంలో వుంది. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీ శ్రేణుల్లో యాక్సెప్టెన్స్ వున్నది ఒక్క బాలయ్యకే. అంతటి మాస్ ఇమేజ్ వున్న నాయకుడు కూడా ప్రస్తుతం పార్టీలో ఎవరూ లేరు. అలాంటి బాలయ్య నుంచి ఇలాంటి టఫ్ టైమ్స్ లో పార్టీ శ్రేణులు అంచనా వేసింది.. ఆశించినదీ వేరు. బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరూ వేరు. అదే తమ్ముళ్ల మనోవ్యథ.
శాసన సభలో పార్టీ ఎమ్మెల్యేలను సమర్థంగా నడిపించాల్సిన బాలకృష్ణ తానే తప్పటడుగులు వేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆయన ప్రవర్తనను టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తున్నవారంతా ఏంటిది అంటున్నారు. అటు వైసీపీ ఇదే అదనుగా సెటైర్లు పేలుస్తోంది. మీ నాన్నగారు స్థాపించిన పార్టీని తిరిగి తీసుకోండి. చంద్రబాబు సీటులో మీరు కూర్చోండి.. అంటూ బాలకృష్ణను మరింతగా రెచ్చగొడుతోంది. దీంతో చంద్రబాబు లేని సమయంలో పార్టీని నడిపిస్తారని ఆశించిన తెలుగు తమ్ముళ్లకు నిరాశే ఎదురవుతోంది. అసెంబ్లీలో అల్లరి చేష్టలు, అందులోనూ బాలయ్య చేస్తున్న హడావుడిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. దేశం క్లిష్టపరిస్థితుల్లో వుంది. బాబు లేని బాధ్యత బాలయ్యపైనే వుందని క్యాడర్ భావిస్తోంది. కానీ బాలయ్య మాత్రం తన ధోరణి తనదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? రెండురోజులుగా శాసన సభలో ఆయన బిహేవియర్ చెబుతున్నదేంటి?
సభ ప్రారంభమైన మొదటి రోజే ఒక రేంజ్ లో గొడవ మొదలైంది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారంటూ నినాదాలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం టీడీపీ బృందంతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇదే సందర్భంలో అంబటితోనూ బాలయ్యకు డైలాగ్ వార్ సాగింది. ఇదే సభలో గందరగోళాన్ని క్రియేట్ చేసింది.స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ సభ్యులు వాదించాల్సింది కోర్టుల్లో అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ మీసం మెలెయ్యడం రాద్దాంతానికి దారి తీసింది. మీసం మెలెయ్యడాలు సినిమాల్లో చేసుకోవాలంటూ బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు అంబటి. తాను సైతం మీసం తిప్పి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ విసిరారు.
ఇలా ప్రజాస్వామ్య దేవాలయంలాంటి శాసన సభలో మీసం మెలెయ్యడాలు, తొడగొట్టడాలు వంటి ప్రవర్తనపై జనం నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేమైనా సినిమానా మీసం మెలేసి యుద్ధం చెయ్యడానికి, తొడగొడితే ట్రైన్ ఆగడానికి అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో తనను చూసి మంత్రి అంబటిరాంబాబు.. మీసం మెలేసి రా అన్నారని బాలకృష్ణ ఆరోపించారు. దాంతో తాను తొడగొట్టి, మీసం మెలేశానన్నారు. మీసం మెలెయ్యడంతో ఆపలేదు బాలకృష్ణ. స్పీకర్ పోడియం దగ్గకు వెళ్లే క్రమంలో అసభ్య సైగలు చేశారు. గౌరవ ప్రదమైన ప్రజాప్రతినిధి ప్రవర్తన వుండేది ఇలాగేనా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక మరుసటి రోజు జరిగిన అసెంబ్లీ సెషన్ లోనూ బాలయ్య బిహేవియర్ చర్చనీయాంశమైంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా, చంద్రబాబు కుర్చీపైనే నిలబడి నినాదాలు చేశారు బాలయ్య.
ఇక విజిల్స్ వేస్తూ గోల చేశారు. సిల్క్ స్కామ్ పై చర్చకు సిద్దమని అధికార పక్షం ప్రకటించినా ఏమాత్రం లెక్కచెయ్యలేదు. విజిల్ తో రీసౌండ్ వచ్చేలా సౌండ్ చేశారు.ఇలా శాసన సభలో బాలకృష్ణ ప్రవర్తన రచ్చరచ్చ అయ్యింది. సొంత పార్టీ నేతలు సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ట్రాప్ లో పడి తెలుగుదేశం స్ట్రాటజీలు ట్రాక్ తప్పేలా చేశారని తెలుగు తమ్ముళ్లు తెగ ఫీలయిపోతున్నారు. ఇదే అదనుగా వైసీపీ ఎమ్మెల్యేలు చెలరేగి మాట్లాడారు. అసెంబ్లీ అంటే బాలకృష్ణకు షూటింగ్ స్పాట్‌గా కనిపిస్తోందని మండిపడ్డారు మంత్రి రోజా. ఏ పార్టీకైనా అసెంబ్లీ అనేది బ్రహ్మాండమైన వేదిక. తెలుగుదేశం కూడా అలానే భావించింది. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా పార్టీ గళం వినిపించాలన్నది ప్లాన్ వేసింది. సభ మొదటి రోజు ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం నుంచి బాలకృష్ణే లీడ్ తీసుకున్నట్టు కన్పించింది. అదే దూకుడును సభలో కూడా ప్రదర్శించారు బాలయ్య. చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఇక బాలయ్య అయితే నేరుగా స్పీకర్ సమీపానికి వెళ్లారు. ఇదే సందర్భంలో మంత్రి అంబటి-బాలకృష్ణ మధ్య వాగ్వాదం.. మీసం మేలేయడం.. తొడ కొట్టడం లాంటివి చకచకా జరిగిపోయాయి. చేత్తో అసభ్య సైగలు చేయడం, విజిల్స్ వెయ్యడం, కుర్చీలపై నుంచోవడం వంటి బాలకృష్ణ ప్రవర్తనతో సభా కార్యకలాపాలు మరింత వేడెక్కాయి.
సహజంగా బాలయ్య అసెంబ్లీకి వచ్చినా.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. వస్తారు..తాను అనుకున్నది మాట్లాడి వెళ్లిపోతారు. గత టర్మ్‌లో అసెంబ్లీకి వచ్చినా పెద్దగా మాట్లాడింది లేదు. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయేవారు. కానీ తొలిసారి యాక్టివ్ అయ్యారాయన. అంతవరకు బాగానే ఉందిగానీ..అసెంబ్లీలో ఆయన దూకుడు కారణంగానే వ్యవహారం సస్పెన్షన్ల వరకు వెళ్లిపోయిందంటున్నారు. పోడియం దగ్గర మీసం మెలేసినందుకు తొలిసారిగా వార్నింగ్ రావడంతోపాటు.. ముగ్గురు కీలక సభ్యులు పయ్యావుల, కోటంరెడ్డి, అనగాని వంటి ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. అసలే ఆవేశపరుడు..దీనికి తోడు రెచ్చగొట్టుడు సభలో బాలయ్య యాక్టివ్‌గా ఉండటం చూసి.. అధికార పార్టీకి చెందిన కొందరు సభ్యులు పథకం ప్రకారం ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు టీడీపీ నేతలు. ఓ పక్క పోడియం దగ్గర టీడీపీ ఆందోళన కొనసాగుతున్న క్రమంలో సభలోనే కొందరు సభ్యులు ఓ చిన్నపాటి మీటింగ్ పెట్టుకున్నారని.. ఆ తర్వాతే బాలకృష్ణను రెచ్చగొట్టారని చెబుతున్నారు. స్వతహాగానే ఆవేశపరుడైన బాలకృష్ణ ఇక ఆగలేకపోయారు.
సస్పెన్షన్లు మామూలేనని టీడీపీలో మరో వర్గం భావన వినిపిస్తోంది. బాలయ్య ఎపిసోడ్ వైసీపీ వ్యూహమేనని టీడీపీ చెబుతోంది. ఇదే విషయాన్ని దాచుకోకుండా ఆయన కూడా చెప్పారని, మంత్రి అంబటి తనను, తన వృత్తిని అవమానించే విధంగా మాట్లాడితే తానూ ప్రతిస్పందించానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక సస్పెన్షన్ల విషయానికొస్తే.. బాలయ్య ఉన్నా.. లేకున్నా.. సస్పెన్షన్లు జరిగేవని అంటున్నారు టీడీపీ నేతలు. లీడ్ తీసుకుంటున్న నాయకుడిని సాకుగా చూపుతూ టీడీపీని కార్నర్ చేస్తే.. ఎమ్మెల్యేలపై నైతికంగా ఒత్తిడి పెరుగుతుందన్న అంచనాతో సస్పెన్షన్లు చేశారని అంటున్నారు. ఆయనతో సంబంధం లేకుండానే గతంలో సస్పెన్షన్స్ జరగలేదా అన్నది పార్టీ వర్గాల ప్రశ్న. ముగ్గురు కీలక ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారంటే.. ఇది పూర్తిగా వైసీపీ వ్యూహమేననేది టీడీపీ వాదన.
ఈ తరహా చర్చలు.. వారి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. బాలయ్య దూకుడు వల్ల టీడీపీ వేసుకున్న ప్రణాళికలు పారలేదనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ప్రతి సంక్షోభం నుంచి ఒక నాయకుడు పుట్టుకొస్తాడన్నట్టుగా, విపత్కర పరిస్థితుల్లో వున్న తెలుగుదేశంలో బాలకృష్ణ కూడా లీడర్ గా ఎస్లాబ్లిష్ అవడానికి ఇదే మంచి తరుణం అంటున్నారు ఆయన అభిమానులు. అయితే ఆయన ప్రవర్తనే అందుకు విరుద్దంగా వుందంటున్నారు. చంద్రబాబు జైల్లో వుండగా, పార్టీకి అన్నీతానై భరోసాగా ఉండాల్సిన బాలయ్య, వింతవింత ప్రవర్తనతో క్యాడర్ లో మరింత నైరాశ్యం నెలకొనేలా చేస్తున్నారని బాధపడిపోతున్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ ప్రత్యర్థుల వ్యూహాలకు అవకాశం ఇవ్వకుండా శాసన సభలో ధాటిగా మాట్లాడాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు వస్తారో తెలియదు.. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి, పార్టీలో బాలయ్య మరింత క్రియాశీలకంగా వుండాలని కోరుతున్నారు. అయితే, హుందాగా ప్రవర్తించాలని.. సినిమా డైలాగ్స్ తరహాలోనో, సినీ ఫంక్షన్ తరహాలోనే ప్రవర్తిస్తే మొదటికే నష్టమని రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు.