కోల్ కతా వదిలిస్తే… రింకూ సింగ్ వెళ్ళే జట్టు ఇదే
ఐపీఎల్ 18వ సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సీజన్ కంటే ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. డిసెంబర్ లో జరగనున్న మెగా వేలం కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సీజన్ కంటే ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. డిసెంబర్ లో జరగనున్న మెగా వేలం కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే కొందరు ఆటగాళ్ళు వేరే ఫ్రాంచైజీలకు వెళ్ళేందుకు వేలంలోకి రావాలని భావిస్తుండగా.. మరికొందరు ఇప్పటికే తమ తమ టీమ్స్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రిటెన్షన్ రూల్ ప్రకారం ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే కొనసాగించుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ యువ ఆటగాడు రింకూ సింగ్ ను రిటైన్ చేసుకోకుంటే అతను వేలంలోకి వెళ్ళడం ఖాయం. అయితే వేలంలో రింకూ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశముందని చెప్పొచ్చు. ఐపీఎల్ లో ఫినిషర్ గా ఇప్పటికే పలుసార్లు సంచలన ఇన్నింగ్స్ లు ఆడిన రింకూ సింగ్ కోల్ కతాను వీడితే తాను ఏ జట్టుకు ఆడాలనుకున్నదీ చెప్పాడు.
ఒకవేళ కేకేఆర్ తనను రిటైన్ చేసుకోకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాలని ఉందన్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆడడం కంటే తనకు మరేదీ గొప్ప విషయం కాదంటూ చెప్పుకొచ్చాడు. 2018లో కోల్ కతా టీమ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రింకూ సింగ్ ఇప్పటి వరకూ 45 మ్యాచ్ లు ఆడి 893 పరుగులు చేశాడు. 2018లో కోల్ కతా అతన్ని 80 లక్షలకు కొనుగోలు చేయగా… 2022లో 55 లక్షలకే సొంతం చేసుకుంది. అయితే కోల్ కతా అతన్ని రిటైన్ చేసుకోకుంటే… వేలంలో రింకూ సింగ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంటుంది.