ఆసీస్ నెగ్గితే భారత్ కు కష్టమే కివీస్ గెలుపుకై ఫ్యాన్స్ ఆశలు
యుఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా సెమీఫైనల్ రేస్ ఉత్కంఠ రేపుతోంది.మెగా టోర్నీలో ఫేవరేటు జట్టుగా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసి అవకాశాల్ని దెబ్బతీసుకుంది.
యుఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ రసవత్తరంగా మారింది. ముఖ్యంగా సెమీఫైనల్ రేస్ ఉత్కంఠ రేపుతోంది.మెగా టోర్నీలో ఫేవరేటు జట్టుగా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసి అవకాశాల్ని దెబ్బతీసుకుంది. 58 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవడం రన్ రేట్ పై ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత పాకిస్థాన్‌పై విజయం సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్ అనుకున్నంతగా పెరగలేదు. ప్రస్తుతం భారత మహిళల జట్టు రెండు పాయింట్లతో గ్రూప్-ఏలో నాలుగో స్థానంలో ఉంది. దీంతో సెమీఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పక విజయం సాధించి, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే గ్రూపులో ప్రస్తుతం న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా పాకిస్థాన్ భారత్ కంటే ముందున్నాయి.
భారత్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా… మిగిలిన మ్యాచ్ ల ఫలితాలు కూడా అనుకూలంగా వస్తేనే సెమీస్ చేరుతుంది. దీనిలో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ విజయం సాధించాలి. అలాగే అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో కూడా కివీస్ నెగ్గాలి. అప్పుడు భారత్‌కు సెమీస్ రూట్ క్లియర్ అవుతుంది. అదే సమయంలో భారత్ కూడా తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లను తప్పక ఓడించాల్సిందే. అప్పుడు 8 పాయింట్లతో న్యూజిలాండ్, ఆరు పాయింట్లతో భారత్ సెమీస్ లో అడుగుపెడతాయి. ఒకవేళ న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలిస్తే భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. అప్పుడు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేటుపై ఆధారపడాల్సి ఉంటుంది. నెగిటివ్‌లో ఉన్న భారత్ పాజిటివ్ రన్రా రేట్ లోకి రావాలంటే ఆసీస్, లంకపై భారీ విజయాలు సాధించాలి.
అలాగే మిగిలిన మ్యాచ్ లలో కొన్ని ఫలితాలు మనకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. కివీస్ చేతిలో భారీ ఓటమే ఈ పరిస్థితికి కారణం. మరోవైపు స్లో పిచ్ లపై భారత మహిళల జట్టు తర్వాతి మ్యాచ్ లలో ఎలా ఆడుతుందనేది చూడాలి. కేవలం గెలవడమే కాకుండా రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
దీనికి తోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ మెడనొప్పితో బాధపడుతుండడంతో తర్వాతి మ్యాచ్ లో ఆడుతుందా అనేది అనుమానంగా ఉంది. పాక్ పై అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన భారత మహిళల జట్టు తర్వాత శ్రీలంకపై కూడా ఇదే జోరు కొనసాగించాలి. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో లంక భారత్ కు షాకిచ్చి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక మహిళల జట్టును కూడా తేలిగ్గా తీసుకోలేం. మొత్తం మీద కంగారూలపై కివీస్ మహిళల విజయం కోసం భారత్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.