Telangana BJP: బీసీ అభ్యర్థికే ముఖ్యమంత్రి పీఠం.. బీజేపీ కొత్త అస్త్రం.. తెరపైకి ఊహించని పేర్లు..
బీజేపీ గెలిస్తే బీసీని సీఎం చేస్తామన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది. టికెట్ల కేటాయింపులోనూ బీసీలకే పెద్ద పీట వేయాలని ఫిక్స్ అయింది.
లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా రావాలని ఫిక్స్ అయింది అనుకుంటా బీజేపీ ! ప్రత్యర్థి పార్టీల దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది అందుకే. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. తాము గెలిస్తే బీసీని సీఎం చేస్తామన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది. టికెట్ల కేటాయింపులోనూ బీసీలకే పెద్ద పీట వేయాలని ఫిక్స్ అయింది. తెలంగాణ మొత్తం జనాభాలో 54శాతానికిపైగా బీసీలే ఉన్నారని.. వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లేందుకు.. బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది.
అక్టోబర్ నెలాఖరులోగా.. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చేపట్టబోయే బీసీగర్జన సభలోగానీ.. మరోచోట నిర్వహించే బహిరంగ సభలో కానీ.. దీనిపై ప్రకటన వచ్చే చాన్స్ ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయ్. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సాంప్రదాయం కాదని.. ఐనా సరే దాన్ని పక్కనపెట్టి ఓ కీలకనేత పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. బీసీ నినాదంతో పాటు.. ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా.. రెడ్డి, ఇతర సామాజికవర్గాలను దగ్గర చేసుకునేందుకూ బీజేపీ అధిష్టానం వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చాక ఆ బాధ్యతలను కిషన్‌రెడ్డికే అప్పగించింది. ఇప్పుడు పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి కట్టబెట్టింది. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ.. ఇప్పటికే ఆ వర్గానికి చెందిన నాయకులకు పార్టీలో పెద్ద పీట వేసింది.
లక్ష్మణ్‌కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా.. యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో భాగం చేశారు. బండి సంజయ్‌కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బీసీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు. ఉద్యమకాలం నుంచీ బీఆర్‌ఎస్‌లో నంబర్ 2గా ఉండి.. ఆ తర్వాత ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయ్.