భర్తకు ప్రాణం పోసి.. బిడ్డకు ప్రాణమిచ్చి.. రేవతి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ప్రాణం.. ఇప్పుడు లేదు. పుష్ప 2 ప్రీమియర్‌ షో సందర్భంగా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కథ.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టుకుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2024 | 02:40 PMLast Updated on: Dec 07, 2024 | 2:40 PM

If You Know The Story Of Revathi Who Gave Her Husband Her Life Gave Her Child Her Life Your Tears Will Not Stop

ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన ప్రాణం.. ఇప్పుడు లేదు. పుష్ప 2 ప్రీమియర్‌ షో సందర్భంగా.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కథ.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టుకుంటోంది. రేవతిలేని ఇంటిని, జీవితాన్ని ఆ కుటుంబం ఊహించుకోలేకపోతోంది. ఒకప్పుడు ప్రాణం అడ్డు పెట్టి తమకు ప్రాణం పోసిందని.. అలాంటి రేవతి తమ మధ్య లేదు అంటే.. తట్టుకోవడానికి కూడా గుండెకు బలం సరిపోవడం లేదంటూ.. ఆ ఫ్యామిలీ కన్నీళ్లు పెట్టుకుంటోంది.

రష్ ఉంటుందని అర్థమై.. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా ఎలా వెళ్లావ్‌ అంటూ ప్రశ్నించిన చాలా నోళ్లకు రేవతి జీవితం.. తల్లి మనసు సమాధానం చెప్తోంది. రేవతి సంధ్య థియేటర్‌కు వెళ్లింది తన కొడుకు కోసం ! అబ్బాయ్ శ్రీతేజ్‌.. అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్‌. పుష్ప 2 పాటలకు ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. బన్నీని ఎలాగైనా.. కనీసం దూరం నుంచి అయినా చూడాలని తల్లి దగ్గర మారాం చేస్తుండేవాడు. కొడుకు కోరిక తీర్చడం కోసమే ఆ రోజు ఆ తల్లి.. అంత రష్‌లో సంధ్య థియేటర్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఐతే అనుకోని కష్టం.. ఆ తల్లి ప్రాణం తీసింది. నిర్లక్ష్యం అనాలో, విధి పగబట్టింది అనాలో కానీ.. ఆ కుటుంబానికి తల్లిని దూరం చేసింది. బన్నీ థియేటర్‌కు వచ్చినప్పుడు ఒక్కసారిగా అభిమానుల తాకిడి పెరిగింది. వారిని కంట్రోల్ చేసే ప్రాసెస్‌లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తొక్కిసలాట జరిగింది. రేవతి చనిపోయింది ఆ తొక్కిసలాటలోనే ! ఆమె మరణం తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయ్. కొడుక్కి బన్నీని చూపించేందుకు రేవతి.. అతన్ని థియేటర్‌కు తీసుకెళ్లింది. తొక్కిసలాట సమయంలో కొడుకును కాపాడుకునేందుకు.. అతన్ని తన పొత్తిళ్లలో దాచుకుంది.

చివరి శ్వాస వరకు బిడ్డను అలానే అదిమిపట్టుకుంది. బిడ్డ కోసం ఎవరో కాళ్ల కింద నలిగిపోయింది. చివరికి ఊపిరి విడిచింది. బిడ్డను కాపాడేందుకు తన ప్రాణాలనే త్యాగం చేసిందని.. రేవతి గురించి ఆ కుటుంబం చెప్తున్న మాటలు.. ప్రతీ ఒక్కరిని ఎమోషనల్ చేస్తున్నాయ్. కుటుంబమే జీవితం అనుకొని రేవతి బతికేది. ఫ్యామిలీకి కష్టం వస్తే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండేది. రేవతి భర్త భాస్కర్‌కు అనారోగ్య సమస్యలు ఉండేవి. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయకపోతే ప్రాణాలు నిలవడం కష్టంగా మారిన సమయంలో.. భర్త కోసం తన లివర్‌లో కొంత భాగాన్ని దానం చేసింది రేవతి. భర్త ప్రాణాలను నిలబెట్టుకుంది. భర్తతో పాటు పిల్లలను రేవతి కంటికి రెప్పలా చూసుకునేది. అలాంటి కుటుంబంపై ఎవరి కన్ను పడిందో కానీ.. ఒక్క మరణం.. ఆ ఫ్యామిలీని ఛిన్నాభిన్నం చేసింది. భార్య లేదు.. కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. తల్లి, తమ్ముడు ఎక్కడ అని అడిగే కూతురు… కుటుంబం మొత్తం పూర్తిగా డిస్టర్బ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. రేవతి త్యాగాన్ని తలుచుకొని.. భర్త భాస్కర్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయనను ఎలా ఓదార్చాలో.. ఏం చెప్పి ఓదార్చాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రేవతి మరణంతో.. ఓ బిడ్డ తల్లిలేనిదయింది.. ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో వాళ్ల బాధలు తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక అటు రేవతి మరణం ఘటన.. హీరో అల్లు అర్జున్‌ వరకు వెళ్లింది. అభిమాని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఆదుకోవడమే కాదు.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. తన మాటగా.. ప్రతీ హీరో తన అభిమానులకు జాగ్రత్తలు చెప్పాలనే చర్చ జరుగుతోంది.