Rain Alert: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపిన ఐఎండీ అధికారులు.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. మళ్లీ వర్షాలు దంచికొడతాయని అధికారులు చెబుతున్నారు. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయానికి మళ్లీ మబ్బులు పట్టేశాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మళ్లీ వర్షాలు దంచికొట్టే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా సిద్ధిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గురువారం కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం రాష్ట్రంలోని వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెంలో భారీ వర్షపాతం నమోదైంది.
అలాగే హైదరాబాద్‌తో పాటు మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌లో జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు.