Afghanistan: ఎక్కడైనా పుట్టొచ్చు.. ఆదేశంలో మహిళగా తప్ప..! తాలిబన్ల చెరలో ఆఫ్గన్ మహిళలు..!

బహుశా ప్రపంచంలో ఏదేశంలోనూ మహిళలు ఇంత దారుణమైన, కఠినమైన జీవితాలను బతుకూ ఉండరేమో. కానీ ఏం పాపం చేసుకున్నారో తెలియదు.. ఆప్ఘనిస్తాన్ మహిళలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. స్వేచ్చావాయువల కోసం పరితపించిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2023 | 07:00 PMLast Updated on: Aug 15, 2023 | 7:00 PM

In Afghanistan Women Are Living Like Slaves Without Freedom In The Hands Of The Taliban

ఏదో ప్రాణం ఉంది కాబట్టి ఊపిరి పీల్చుతున్నారు తప్ప.. వాళ్లకు జీవచ్ఛవాలకు పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ల బతుకులు వాళ్లవి కావు.. వాళ్ల ఆలోచనలు వాళ్లవి కావు.. ఇంకా చెప్పాలంటే వాళ్ల జీవితాలు కూడా వాళ్లవి కావు. నువ్వు పలానా బట్టలు వేసుకోవద్దని ఒక స్వరం హూంకరిస్తుంది.. నువ్వు కాలేజీకి వెళ్లొద్దని మరో స్వరం ఆదేశిస్తుంది.. అసలు నువ్వు గడపే దాటొద్దని ఇంకో స్వరం బెదిరిస్తుంది. ఆ మాటలను పెడచెవిన పెడితే తుపాకీ గుళ్ల వర్షం కురుస్తుంది. ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ధిక్కారస్వరం వినిపించి సంకెళ్లు తెంచుకునే ధైర్యం చేయలేని నిస్సాయ స్థితి వాళ్లది. బహుశా ప్రపంచంలో ఏదేశంలోనూ మహిళలు ఇంత దారుణమైన, కఠినమైన జీవితాలను బతుకూ ఉండరేమో. కానీ ఏం పాపం చేసుకున్నారో తెలియదు.. ఆప్ఘనిస్తాన్ మహిళలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తాలిబన్ల గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. స్వేచ్చావాయువల కోసం పరితపించిపోతున్నారు.

అక్కడ మహిళలు శాపగ్రస్తులు

సరిగ్గా రెండేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్ ఉగ్రవాదులు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ కనుసన్నల్లో ఉంచుకున్న అమెరికా సైనిక దళాలు.. చివరకు ఆదేశాన్ని వదిలివేయడం ఆఫ్గన్ ప్రజల పాలిట ఒకరకంగా శాపంగా మారింది. అమెరికా దళాల ఉపసంహరణ మొదలవగానే తాలిబన్లు రెచ్చిపోయారు. ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం చేపట్టారు. ఇక దేశాన్ని పాలించబోయేది తామేనని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తాలిబన్లు మహిళల గురించి ఏం చెప్పారో తెలుసా ? మా సమాజంలో మహిళలు చాలా చైతన్యంగా ఉంటారు. వాళ్లను చదువుకోవడానికి మేం అనుమతిస్తాం… ఇదీ తాలిబన్లు ఆగస్టు 15, 2021న చెప్పిన మాట.. కానీ ఏం జరిగింది ? ఏం జరుగుతోంది ?

ఆంక్షల వలయంలో తాలిబన్ మహిళలు

పాలన మొదలుపెట్టిన నెలరోజులకే తాలిబన్లు మూకలు మహిళల విషయంలో ఆంక్షలు అమలు చేయడం మొదలుపెట్టారు. సెకండరీ స్కూల్స్ లోకి అమ్మాయిలకు ప్రవేశం లేకుండా చేశారు. కేవలం అబ్బాయిల కోసమే కొత్త స్కూల్స్ ను ఓపెన్ చేశారు. ఇక అప్పటి నుంచి తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళలందరిపైనా ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. కాబూల్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలపైనా కొరడా ఝులిపించారు. ఇక మీరు ఇంట్లోనే ఉండండి ఆఫీసుకు రావొద్దంటూ మేయర్ హుకుం జారీ చేశాడు. యూనిర్శిటీలో మహిళలకు ప్రవేశం లేకుండా చేశారు. ఉన్నత చదువులు చదవడానికి ఏమాత్రం అవకాశం కల్పించలేదు.

ప్రశ్నిస్తే తుపాకులు పేలతాయ్

కొంతమంది మహిళలు తిరగబడితే వాళ్లపై తుపాకులు ఎక్కుపెట్టారు. తమకు ఎదురు చెప్పిన వాళ్లను బంధించి చిత్రహింసలు పెట్టారు. చివరకు మహిళలకు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కూడా లేకుండా చేశారు. మహిళలు తాము ఉన్న ప్రాంతం నుంచి 72 కి.మీ దాటి బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మగవాళ్లు వెంట ఉండాల్సిందేనంటూ ఆదేశించారు. చివరకు మహిళల వస్త్రధారణ విషయంలోనూ వేలుపెట్టారు తాలిబన్ పాలకులు.. తల నుంచి కాలి వేలు వరకు శరీరం మొత్తం కప్పుకునే ఉండాలంటూ కొత్త డ్రెస్ కోడ్ రూల్స్ ను జారీ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో తాలిబన్లు తమ దేశ మహిళ పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. స్కూల్స్ నుంచి యూనివర్శిటీల వరకు చదువుకోవడానకి ఎక్కడికీ వెళ్లకుండా చేశారు. బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా ఆంక్షలు పెట్టారు. చివరకు ఎన్టీవోల్లోనూ పనిచేయకుండా అడ్డుపడ్డారు. షరియా చట్టాన్ని అమలు చేసే పేరుతో బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బ్యూటీపార్లర్లు, సెలూన్లపై ఆధారపడి బతుకుతున్న దాదాపు 60 వేల మంది మహిళల పొట్టకొట్టారు.

ఈదేశంలో ఎందుకు పుట్టామా అంటూ ఆవేదన

రెండేళ్ల పాలనలో తాలిబన్లు అడుగడుగునా మహిళల హక్కులు హరించేశారు. ఆడపిల్లలుగా పుట్టిన వాళ్లు తమ చెప్పుచేతల్లోనే ఉండాలన్న భావజాలాన్ని ప్రదర్శించారు. మహిళలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రం లేకుండా చేశారు. ప్రపంచంలో ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి.. అరబ్ కంట్రీస్ ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తూ అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తాలిబన్ల బారిన పడి వెనక్కి ప్రయాణిస్తోంది. ఈదేశంలో ఎందుకు పుట్టామో అనుకుంటూ మహిళలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యం, హక్కులు వంటి మాటలకు తాలిబన్ల దృష్టిలో విలువ లేదు. వాళ్లకు తెలిసిందల్లా.. షరియా పేరుతో ఆంక్షలు విధించడం. రెండేళ్లకే ఆప్ఘాన్ మహిళలు తమ జీవితాలను కోల్పోతే.. భవిష్యత్తులో మహిళల దుస్థితి ఎంత దారుణంగా ఉండబోతోందో ఆలోచించుకోవచ్చు.