Kondagattu : కోటిమొక్కుల దేవుడు.. కొండగట్టు రహస్యం
హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు.. ఆయనను పూజిస్తే దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు.. ఆయనను పూజిస్తే దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక.. శ్రీరామ నామ స్మరణ చేసిన వాళ్లను ఈ రామబంటు అనుక్షణం తోడునీడగా వెన్నంటి కాపాడుతాడని భక్తుల నమ్మకం.. ఇక మన దేశంలో ఎన్నో ప్రఖ్యాత ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నప్పటికీ.. తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉన్న విశిష్టత, ప్రత్యేకత వేరు.. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయత, సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. స్వయంభూగా వెలసిన ఇక్కడి ఆంజనేయుడిని దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహం పొండానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
భక్తులు ఎంతో మహిమాన్వితంగా భావించే ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేములవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఉంటుంది. ఈ క్షేత్రంలో సహజసిద్ధంగా వెలసిన కొనేటిలో పుణ్యస్నానం చేస్తే భక్తులు తాము చేసిన పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే వ్యాధులు ఉన్నవారు, సంతానం లేని వారు పూజలు చేస్తే తప్పక ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈ ఆలయంలో 41 రోజుల పాటు గడిపితే ఎలాంటి వ్యాధి అయినా నయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ ఆలయానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది.. 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి అంజనేయ స్వామి కనిపించినట్లు కథనం ఉంది. సంజీవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయిందట.. ఆ అవును వెదుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టుకింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి.. తాను కోరంద పొదలో ఉన్నాననీ.. తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని.. నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడట.. అప్పుడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, ‘శ్రీ ఆంజనేయుడు’ కంటపడ్డాడట. . తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడట.. ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారుట. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు..
ఇక.. ఈ మహిమాన్విత క్షేత్రానికి సంబంధిచి ఓ పురాణ చరిత్ర కూడా ప్రచారంలో ఉంది.. త్రేతా యుగంలో రామ , రావణ యుద్ద సమయంలో లక్ష్మణుడు మూర్చ పోతాడు. ఆ సమయంలో ఆంజనేయుడు సంజీవని తెచ్చే క్రమంలో ఆ మూలికలు ఉన్న పర్వతం పెకలించుకుని తెస్తుంటే కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందని అదే ఈ కొండ గట్టుగా ప్రసిద్ధి చెందిందని చెపుతారు. అంతేకాదు.. ఇప్పుడున్న ఈ ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది..
కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో పలు ముఖ్యమైన దినాల్లో ఉత్సవాలు, పూజలు, పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో ఏటా చైత్ర పౌర్ణమిరోజున హనుమాన్ చిన్నజయంతి, వైశాఖ బహుళదశమినాడు పెద్ద హనుమాన్ జయంతిలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జయంతి ఉత్సవాల్లో ఆంజనేయస్వామి దీక్ష చేపట్టిన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్న తరువాత ఆలయంలో ముడుపులు కట్టి వెళ్తారు. ఇక పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు హోమం, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.. కొండగట్టు ఆలయంలో ఉగాది రోజు పంచాంగ శ్రవణం, చైత్ర శుద్ధనవమి రోజున శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం, శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాల్లో నెల రోజులపాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం, లోక కల్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు, ప్రపంచ శాంతి కోసం ఏటా 3 రోజులపాటు శ్రీ సుదర్శన మహాయాగం.. తదితర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు..భక్తులు ఈ పూజల్లో పాల్గొనిభక్తుల మొర ఆలకించే మనస్సున్న దైవంగా.. కొండగట్టు అంజన్నగా.. ప్రఖ్యాతి గాంచిన ఆ ఆంజనేయుని కృపకు పాత్రులవుతారు.