CM kcr: ‘ప్లస్’ కాదు ‘సైలెంట్’ అయింది.. బెడిసికొట్టిన కేసీఆర్ వ్యూహం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టనుందా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 10:27 AMLast Updated on: Sep 07, 2023 | 10:27 AM

In Telangana Cm Kcrs Strategy Is Not Working

ఆరంభం అదిరింది.. కానీ ఆ తర్వాతే అంతా సైలెంట్ అయింది అన్నట్టుగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి. 115 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించే దాకా కనిపించిన జోష్ .. ఆ తర్వాత మిస్సయ్యింది. ఇందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా కారణాలే ఉన్నాయి. చాలా అడ్వాన్స్ గా నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం అనేది.. కారు పార్టీలో సైలెన్స్ కు దారితీసిన అతిపెద్ద కారణమని రాజకీయ పండితులు అంటున్నారు. ముందస్తుగా క్యాండిడేట్స్ ను ప్రకటిస్తే ప్లస్ అవుతుందని కేసీఆర్ అనుకుంటే.. సైలెన్స్ అయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గులాబీ దళాన్ని ఆవరించిన ఈ సైలెన్స్ ను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ బిజీగా ఉంది.

అందరికీ ఫస్ట్ ప్రయార్టీగా కాంగ్రెస్

బీఆర్ఎస్ టికెట్లు దక్కని వారికి ఇప్పుడు ఫస్ట్ ప్రయార్టీగా కాంగ్రెస్ మారింది. తుమ్మల నాగేశ్వరరావు దగ్గరి నుంచి మైనంపల్లి హనుమంతరావు దాకా అందరి చూపూ కాంగ్రెస్ వైపే ఉండటాన్ని బట్టి.. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదిగిందనేందుకు సంకేతం. చివరకు చిన్నపాటి రాజకీయ పార్టీని నడుపుతున్న షర్మిల కూడా హస్తం పార్టీలోకే జాయిన్ కాబోతున్నారు. ఇక కేసీఆర్ నో చెప్పడంతో.. వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ వైపుకే వెళ్లాయి. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు గులాబీ గూటిలో కలవరాన్ని రేకెత్తిస్తున్నాయని తెలుస్తోంది. ఇక త్వరలోనే 16వ తేదీన హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం, 17న సోనియాగాంధీ సభ తర్వాత కాంగ్రెస్ మరింత జోష్ తో జనంలోకి వెళ్లనుంది. అభ్యర్థుల జాబితాను హస్తం పార్టీ ప్రకటిస్తే.. ఇక క్యాండిడేట్స్ ఎక్కడికక్కడ ప్రచారంలో దూసుకుపోనున్నారు.

ప్రశాంత్ కిశోర్ .. బ్రహ్మ కాదు..

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఇటీవల ప్రశాంత్ కిశోర్ చెప్పారు. అయితే ఫ్యూచర్ ను ప్రెడిక్ట్ చేయడానికి ఆయనేం బ్రహ్మ కాదు. కర్ణాటకలో ఏం జరిగిందో దేశమంతా చూసింది.. హిందుత్వ ఎజెండాతో జనంలోకి వెళ్లడం వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ కు మళ్లీ స్టెమినా వచ్చేసింది. ఆ పార్టీలో కీలక నేతలు, ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు చేరుతున్నారు. ఇవన్నీ కలిసి వచ్చే పోల్స్ లో హస్తం పార్టీ బలం పెరగడం ఖాయం. ఒకవేళ ఆ పార్టీ ప్రకటించే సంక్షేమ పథకాలు బలంగా జనంలోకి వెళితే.. తెలంగాణలో గెలిచినా ఆశ్చర్యం లేదు. ఇదంతా కేసీఆర్ గ్రహించారు కాబట్టే.. చివరకు మహిళను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొన్న తాటికొండ రాజయ్యను కూడా పార్టీలోనే ఉండాలని కోరుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ ను పంపి రాజయ్యతో రాజీ కుదుర్చుకునే యత్నం చేశారు. కాంగ్రెస్ వేవ్ ను కేసీఆర్ గ్రహించారు అనేందుకు ఇదే పెద్ద సంకేతం. మరోవైపు డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు ఆయా వర్గాలలోని పేదలందరికీ ఇంకా చేరలేదు. ఆ స్కీమ్స్ వల్ల లబ్ధి పొందిన వాళ్ల కంటే .. లబ్ధిపొందని వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ వైపు తిరిగి చూస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా వస్తుంది.