CM kcr: కాంగ్రెస్ ను ఖాళీ చేయడంపై దృష్టి పెట్టిన కేసీఆర్..!!

బండి సంజయ్ హయాంలో మంచి స్వింగ్ లోకి వచ్చిన బీజేపీ.. ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక డౌన్ అయిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2023 | 12:48 PMLast Updated on: Aug 30, 2023 | 12:48 PM

In Telangana Kcr Is Working To Get The Main Leaders Of The Congress Into His Party

కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి దూరం పాటిస్తానని బీఆర్ఎస్ నుంచి లభించిన హామీ వల్లే.. తెలంగాణలో పార్టీని వీక్ చేసుకునేందుకు బీజేపీ రెడీ అయిందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈవిధంగా బీజేపీ నుంచి పోటీని తప్పించుకున్న కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ ను డీలా చేసే దిశగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. గత మూడు నెలల బహిరంగ సభల్లో కేసీఆర్ చేసిన ప్రసంగాలను చూస్తే.. ఆయన కాంగ్రెస్ నే ప్రధాన ప్రత్యర్ధిగా పరిగణిస్తున్నారనే విషయం తేటతెల్లం అవుతుంది. ఇక బీఆర్ఎస్ లోని కొందరు నేతలు కూడా హస్తం పార్టీ టార్గెట్ గా వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు. ‘కాంగ్రెస్ లోకి కోవర్టులను పంపాం..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవల చేసిన కామెంట్ ను కూడా ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ‘కాంగ్రెస్ వాళ్లంతా తన దగ్గర కుక్కల్లా పడుంటారు. ఆ పార్టీని వీక్ చేయడానికి వాళ్లను లాగేస్తాం’ అని గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. అయితే ఈ విమర్శనాస్త్రాలను ఎదుర్కొని ఎన్నికల దాకా కాంగ్రెస్ ఐక్యంగా నిలవగలదా ? గెలవగలదా ? అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.

వాస్తవానికి కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించినప్పటి నుంచే కేసీఆర్ అండ్ టీమ్ కు భయం మొదలైంది. రాష్ట్రంలో ఆ వేవ్ వీస్తే నిలవడం కష్టమనే భావనకు అప్పట్లో బీఆర్ఎస్ పెద్దలు వచ్చారు. అయితే ఈ అనుకూల పవనాలను అందిపుచ్చుకునే విషయంలో మాత్రం కాంగ్రెస్ చాలా స్లోగా ఉంది. బీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నవాళ్లతో చర్చలను వేగవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికను హస్తం పార్టీ అమలు చేయలేకపోతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనైతే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినా.. వారికి గ్రీన్ సిగ్నల్ లభించడానికి నెలల తరబడి టైం పడుతోంది. అప్పటికే అక్కడ పాతుకుపోయిన పాతతరం నేతలు మోకాలు అడ్డుతుండటంతో ఇలా జరుగుతోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత వేముల వీరేశం.. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెండు నెలల క్రితమే ఆసక్తిని కనబర్చారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణంగా ఆయన కాంగ్రెస్ లో చేరడం ఆలస్యమైంది. సుదీర్ఘ మంతనాల తర్వాత రెండు,మూడు రోజుల క్రితమే వేముల వీరేశం ఎంట్రీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోమటిరెడ్డి వంటి నాయకుల ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలను పరమావధిగా భావిస్తే తప్ప కాంగ్రెస్ మళ్లీ పుంజుకోలేదు.

కాంగ్రెస్ ను ప్రజల దృష్టి బద్నాం చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను గులాబీ దళం వాడుకుంటోంది. ప్రజా గాయకుడు గద్దర్‌ మరణాన్ని కూడా కాంగెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుందనే విమర్శలను బీఆర్ఎస్ పార్టీ చేసింది. దేశంలో ఆహార ధరల సంక్షోభం తీవ్రంగా ఉన్నా దానిపై నోరు మెదపని కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీని కడిగి పారేయడంలో మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాష్ట్రానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు వేడి తగ్గడం.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీపై విమర్శలను ఆపేయడం రాజకీయ వర్గాల్లో పెను అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టుగా రెడ్డి వర్గానికి చెందిన నేతలు ఉండేవారు. హస్తం పార్టీకి చెక్ పెట్టేందుకుగానూ ఈసారి రెడ్డి లీడర్లకు బీఆర్ఎస్ పెద్దపీట వేసింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రకటించిన 115 అసెంబ్లీ సీట్లలో 40 టికెట్లు రెడ్డి వర్గం వారే పొందడం గమనార్హం.