Congress: తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోవడం కష్టమేనా ?
రాజకీయం ఎప్పుడూ థ్రిల్లర్ సినిమానే ! ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయడం అంత ఈజీ కాదు. వార్ వన్‌సైడ్ అన్నట్లు కనిపించినా.. ఏదో ఒకరోజు తీసుకునే చిన్న మలుపు.. రాజకీయం స్థితిగతులనే మార్చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. రాజకీయం సప్పగా మారిపోయింది తెలంగాణలో. మొదటి ఎన్నికల్లో గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్ చేయకపోయినా.. మంచి మెజారిటీ సాధించింది.

In the background of massive inclusion in Congress, BRS must have a tough competition.. Is it difficult for Congress to face
అప్పుడు మొదలైన కేసీఆర్ ఆటతో.. రాజకీయం అల్లాడిపోయింది. గులాబీ పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదా తెలంగాణలో అనే స్థాయికి మారింది రాజకీయం. తర్వాత జరిగిన మెజారిటీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం.. స్థానిక ఎన్నికల్లోనూ రికార్డులు క్రియేట్ చేయడంతో.. కారు జోరుకు బ్రేకుల్లేకుండా పోయాయ్. గత ఎన్నికల్లో ఒకరకంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేక పరిస్థితులు కనిపించినా.. చంద్రబాబు రూపంలో కేసీఆర్ వరం దొరికినట్లు అయింది. కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తానా.. కేసీఆర్‌కు కలిసి వచ్చింది. దీంతో విపక్షాల జాడ లేకుండా పోయింది ఆ ఎన్నికల్లో ! కాంగ్రెస్ నుంచి గెలిచిన అంతో ఇంతో మంది నేతలు కూడా.. గులాబీ పార్టీ చేరుకోవడంతో.. హస్తం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. ఇక అదే సమయంలో బీజేపీ సీన్‌లోకి రావడం.. వరుసగా ఉపఎన్నికల్లో విజయం సాధించడంతో.. బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమా అనే చర్చ జరిగింది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు హుజురాబాద్ విజయంతో గాల్లో తేలినట్లు కనిపించిన బీజేపీకి.. మునుగోడు ఓటమితో రియాలిటీ అర్థం అయింది.
హైదరాబాద్ అవతల, గ్రామీణ ప్రాంతాల్లో అంత సీన్ లేదని అర్థం అయింది. క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకోవాలని అర్థం అయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య కర్ణాటక ఫలితం.. కమలం పార్టీని మరింత దెబ్బతీసింది. బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు.. గోడ మీద పిల్లిలా ఉన్న నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హస్తం పార్టీకి ఫుల్ జోష్ ఇస్తోంది. పొంగులేటి, జూపల్లి చేరిపోయారు.. మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే క్లారిటీ వచ్చింది. దీంతో కాంగ్రెస్ జోష్‌ను ఆపడం ఎవరితరం కాదు అనే చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. ఇప్పుడు దాదాపు అందరూ కారు వైపే చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, చోటామోటా నేతల నుంచి.. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న నేతల వరకు.. అందరూ ఇప్పుడు హస్తం వైపే చూస్తున్నారు.
వాళ్లంతా కాంగ్రెస్ గూటికి చేరితే.. హస్తం పార్టీ విజయాన్ని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. దీనికితోడు గాంధీ కుటుంబ వ్యక్తులను పదేపదే రాష్ట్రానికి తీసుకురావడం వల్ల.. తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్‌ను.. అమరవీరులు కలలు కన్న తెలంగాణను ప్రస్తావిస్తూ.. సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అటు పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఎలా చూసినా.. కాంగ్రెస్‌ను ఆపడం సాధ్యం అవుతుందా అనే చర్చ జరుగుతోంది జనాల్లో, రాజకీయవర్గాల్లో.