BRS Dynasty of Politics: తెలంగాణ వ్యాప్తంగా జోరందుకున్న వారసత్వ రాజకీయాలు.. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు వీరే..
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొంత మంది నాయకుల్లో వారసత్వపు ఆశలు చిగురిస్తున్నాయి.
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణలో మూడవ సారి అధికారాన్ని సొంతం చేసుకొని హాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి వారసత్వపు వినతి పత్రాలు ప్రగతి భవన్ కి వచ్చి చేరుతున్నాయి. అందులో తలసాని కుమారుడు, మల్లారెడ్డి అల్లుడితో పాటూ మరికొందరు కీలక నేతలు టికెట్ విషయంలో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రయత్నాలు చేసే వారిలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ తయారు చేసే విషయంలో సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. వీరిలో కేవలం గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న వారికి మాత్రమే టికెట్ కేటాయించే పనిలో ఉన్నారు. తెలిసినవారు, బాగా దగ్గరి వారు అనే మొహమాటానికి పోకుండా సర్వేలు చేయించి మరీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారట. ఇలా పార్టీ టికెట్ ఆశించే ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ తమపై దయచూపుతారా లేదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారికి సైతం అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా వారి కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది. అందులో తలసాని, మల్లారెడ్డి ఉన్నారు. తలసాని కుమారుడు తలసాని సాయికి సనత్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శ్రీనివాస్ యాదవ్ ను సికింద్రాబాద్ ఎంపీ గా బరిలో దింపే అవకాశం ఉంది. అలాగే మల్లారెడ్డి అల్లుడికి మేడ్చల్ ఎమ్మెల్యేగా రంగంలో దింపి మల్లారెడ్డిని పార్లమెంట్ కు పంపించేందుకు వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఈ వారసత్వ వేటలో మరికొందరు ఎమ్మెల్యేల కుమారులతో పాటూ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి వారి నియోజక వర్గాల్లో ప్రచారాలు, జనంలో కలివిడిగా తిరగడాలు చేస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఆర్మూర్, తాండూర్, నిజామాబాద్ అర్బన్, నిర్మల్, పటాన్ చెరు, చేవెళ్ల, షాద్ నగర్ ఎమ్మెల్యేలకు చెందిన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.
జిల్లాల వారిగా వారసత్వ రాజకీయాలు ఇలా..
ఉమ్మడి రంగారెడ్డి
- మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ రావు
- కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు
- మంత్రి సబితా కుమారుడు కార్తీక్ రెడ్డి
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు ముఠా జయసింహా
ఉమ్మడి కరీంనగర్
- కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ సంజయ్
- మంథనిలో పుట్ట మధు భార్య పుట్ట శైలజ
ఉమ్మడి ఆదిలాబాద్
- ఎమ్మెల్యే జోగు రామన్న కుమారుడు జోగు ప్రేమేందర్.
- సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోణప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కుమారుడు వినోద్.
- మంచిర్యాల ఎమ్మెల్యే నడింపెల్లి దివారకర్ రావు కుమారుడు విజిత్ రావు
- ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్
ఉమ్మడి ఖమ్మం
- కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారులు రామకృష్ణ, రాఘవేంద్ర
- భద్రాచలం ఇన్చార్జ్ తెల్లం వెంకట్ రావు చెల్లెలు సీతమ్మ
ఉమ్మడి వరంగల్
- గండ్ర వెంకటరమణా రెడ్డి తన భార్య గండ్ర జ్యోతి
- డీఎస్ రెడ్యానాయక్ కుమారుడు డీఎస్ రవిచంద్ర, కుమార్తె మాలోత్
ఉమ్మడి నిజామాబాద్
- బాన్సువాడ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి
- ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు జగన్ మోహన్
- హనుమంతు షిండే కుమారుడు హరీష్ కుమార్ షిండే
- గంప గోవర్ధన్ కుమారుడు శశాంక్
ఉమ్మడి నల్లగొండ
- శాశన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి
- ఎన్. భాస్కర్ రావు కుమారుడు సిద్దార్థ్
- కంచర్ల భూపాల్ రెడ్డి తమ్ముడు క్రిష్ణారెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్
- బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి భార్య జ్యోతి
- చిట్టెం రామ్మోహన్ రెడ్డి సతీమణి సుచరిత
- పొతుగంటి రాములు కుమరుడు భరత్
- వీఎం అబ్రహాం కుమారుడు వీఎం అజయ్
జిల్లాల వారిగా పైన తెలిపిన జాబితాలో కొందరు ఇప్పటికే నామినేటెడ్ , జెట్పీటీసీ పదవుల్లో పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. వీరందరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీలో తమ గొంతుక వినిపించాలని ఆశ పడుతున్నారు. వీరిలో ఎంతమందికి సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తారు. ఇచ్చిన వారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది వేచిచూడాలి.
T.V.SRIKAR