Chandrababu Case: ఏసీబీ కోర్టులో బాబు కేసు విచారణ వాయిదా.. సుప్రీం కోర్టులోనూ ఇదే పరిస్థితి..
చంద్రబాబు కేసులు జిల్లా కోర్టుల నుంచి హై కోర్టుకు చేరింది. తాజాగా హై కోర్టును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు వరకూ వెళ్లాయి. దీనిపై ఎక్కడా బాబుకు స్పష్టమైన తీర్పు రాకపోవడంతో అయోమయంలో పడుతున్నారు టీడీపీ శ్రేణులు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చిన నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు టీడీపీ తరఫు లాయర్లు. అయితే తాజాగా ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడగా సుప్రీం కోర్టులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఏలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.
ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ తరఫు న్యాయవాది పిటిషన్ వేయగా.. బెయిల్ కోరుతూ టీడీపీ తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు విచారణకు వస్తుందని అందరూ భావించారు. తాజాగా బెయిల్ పిటిషన్ వాయిదా వేసినట్లు తెలిపింది ఏసీబీ కోర్టు. దీనికి కారణం ఏసీబీ స్పెషల్ కోర్టు న్యామమూర్తి సెలవులో ఉన్నారు. కావున ఇన్ చార్జి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో ఈరోజు కస్టడీ పిటిషన్ పై కూడా విచారణ సాధ్యం కాదని తెలిపారు. దీంతో కస్టడీతోపాటూ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది.
ఏపీ హై కోర్టులో రెండు కేసుల విచారణ..
ఇదిలా ఉంటే గత నెల అంగళ్లులో చంద్రబాబు ఉద్రిక్తపూర్వక వాతావరణాన్ని సృష్టించారని పుంగనూరు అంగళ్లులో కేసు నమోదైంది. పోలీసు అధికారులు అనుమతి లేదన్నా వినకుండా ఈ గ్రామానికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇందులో ఇధ్దరు పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈకేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు వ్యవహారంలో ఇప్పటికే కొందరు అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా చంద్రబాబుకు ఈ కేసులో సంబంధముందని న్యాయవాదులు కేసు బుక్ చేశారు. ఇందులో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. దీనిపై ఏపీ హైకోర్టులో నేడు వాదనలు జరుగనున్నాయి. కోర్టు లోని 21వ నెంబర్ గదిలో కేసు నంబర్ 33,34 విచారణకు రానున్నాయి. ఇక్కడైనా చంద్రబాబుకు ఊరట లభిస్తుందా.. లేక వాయిదా పడుతుందా వేచి చూడాలి.
సుప్రీం కోర్టులోనూ వాయిదాల పర్వం.?
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అది తిరస్కరణకు గురైన విషయం మనకు విదితమే. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. సీజేఐ సోమవారం ఈ కేసును పక్కకు పెట్టడంతో మంగళవారానికి మెన్షనింగ్ స్లిప్ తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కోర్టుకు హాజరై ఇతర కేసులు విచారణ చేపట్టారు. ఈతరుణంలో చంద్రబాబు కేసు ప్రధాన న్యాయమూర్తి వద్దకు రాలేదు. మెన్షనింగ్ కేసు ఈరోజు బెంచ్ ముందుకు వచ్చే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈరోజు మెన్షన్ పిటిషన్ విచారణకు రాకపోతే రేపు లేదా అక్టోబర్ 3న విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు కొందరు న్యాయవాదులు తెలుపుతున్నారు.
T.V.SRIKAR