Sim Cards New Rules: సిమ్ కార్డుల విషయంలో జర జాగ్రత్త.. అక్టోబర్ 1 నుంచి సరికొత్త రూల్స్ ఇవే..

ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా ఏమీ సాధ్యం కాదు. అయితే ఆ మొబైల్ కి నెట్వర్క్ అత్యంత ముఖ్యం. స్మార్ట్ ఫోన్ ను శరీరం అనుకుంటే సిమ్ కార్డును గుండెతో పోల్చచ్చు. తాజాగా కేంద్రం పరిధిలోని టెలికమ్యూనికేషన్ సంస్థ ఈ సిమ్ కార్డుల క్రయ-విక్రయాల విషయంలో సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2023 | 08:31 AMLast Updated on: Oct 02, 2023 | 8:31 AM

In The Case Of Sim Cards The Telecommunication Company Has Made The New Rules Available From October 1

అక్టోబర్1 నుంచి టెలికాం రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సిమ్ కార్డుల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంస్థ కొన్ని మార్పులను చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. సిమ్ కార్డులు అమ్మాలనుకునే వారు కొన్ని ముఖ్య సూచనలు పాటించాల్సి ఉంటుంది. వీటిలో ఏవైనా అధిగమిస్తూ నియమాలను, సరైన ప్రమాణాలను పాటించకుంటే 10లక్షల వరకూ జరిమానా విధిస్తారు. భారత్ లో రోజు రోజుకూ సిమ్ కార్డు మోసాలు పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకట్ట వేసేందుకే సరికొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ కఠినమైన చర్యల వల్ల ఆన్లైన్ ఆర్థిక నేరాలకు కొంత వరకూ అడ్డుకట్ట వేయచ్చని భావిస్తున్నారు.

కొనుగోలుదారులపై ప్రభావం..

నకిలీ సిమ్ కార్డులను నియంత్రించేందుకు విక్రయదారులపైనే కాకుండా కొనుగోలుదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మన దేశంలో ప్రతి రోజూ కొన్ని లక్షల సిమ్ కార్డుల వ్యాపారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రీ పెయిడ్ సిమ్ కార్డులు అధిక సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి పేరుతో రిజిస్టర్ అయి ఉన్న సిమ్ కార్డులు మరొకరికి అతి సులువుగా అందజేస్తున్నాయి డిస్టిబ్యూటర్ సంస్థలు. దీనికి సరైన ఆధారాలు, ఫోటోలు ఏవీ లేకుండానే విక్రయాలు జరుపుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు గతంలో చాలా వెలుగులోకి వచ్చాయి. అందుకే ఇలాంటి వాటిపై కఠినమైన ఆంక్షలు విధిస్తే.. గతంలో జరిగిన మోసాలు భవిష్యత్తులో జరుగకుండా ఉండేలా చేయవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తరుణంలో ప్రస్తుతం యాక్టివేట్ అయి ఉన్న సిమ్ కార్డులను ఇతరుల పేరుతో బదిలీ చేసేందుకు అవకాశం ఉండదు. ఒక వేళ అలా చేస్తే అమ్మకందారులపై దృష్టి పెట్టి వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

సరికొత్త విధానం ఇదే..

టెలికమ్యూనికేషన్ తెలిపిన వివరాలు ప్రకారం.. ఒక సిమ్ వినియోగదారునికి అమ్మే ముందు అతనికి సంబంధించిన పూర్తి అడ్రస్ ఫ్రూఫ్, ఫోటో వంటివి తీసుకోవాలి. అవి సరైనవేనా కాదా అని పరీక్షించుకోవాలి. పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకోవాలి. సిమ్ కార్డులు అమ్మే ప్రతి షాపు వారికి ఒక కార్పొరేట్ ఐడీ నంబర్ లేదా సీఐఎన్ నంబర్ ను కేటాయిస్తారు. ఈ ఎమర్జెన్సీ నంబర్ లేకుండా ఎవరూ సిమ్ కార్డులను అమ్మలేరు, కొనలేరు. ఈ ప్రక్రియలో ప్రతి రిటైలర్ తన షాపుకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటూ తన ఆధార్, పాన్, పాస్ పోర్ట్, జీఎస్టీ వివరాలు పొందుపరచాలి. ఈ వివరాలు ఇవ్వకుండా షాపులు రిజిస్ట్రేషన్ కు అనుమతులు ఇవ్వరు. ఒకవేళ ఇలాంటి అనుమతులు తీసుకోకుండా సిమ్ కార్డులు విక్రయిస్తే వారి ఐడి బ్లాక్ చేసి కఠిన చర్యలు తీసుకుంటుంది టెలికాం సంస్థ. అదే క్రమంలో వినియోగదారుడు సిమ్ కార్డ్ పోగొట్టుకున్నా, బ్లాక్ అయినా తిరిగి మొదటిసారి కొనుగోలు చేసినప్పుడు ఎలా వెరిఫికేషన్ చేయించుకుని తీసుకున్నారో అదే ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. గతంలో లాగా విరివిగా సిమ్ కార్డులు అందించే పరిస్థితులకు తెరదించుతూ సరికొత్త మార్గదర్శకాలను అమలుచేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం ద్వారా సిమ్ కార్డు మోసాలు, బ్లాక్ మెయిలింగ్ సంఘటనలు, నేరాలను కొంతమేర నియంత్రించవచ్చు అంటున్నాయి.

T.V.SRIKAR