Weather Report: నో వానలు.. ఓన్లీ ఎండలు.. ఈ ఉక్కపోత ఏంటి.. ప్రమాదమేనా?
వారం క్రితం వరకూ వరుణుడు చుక్కలు చూపించాడు. తెలుగు రాష్ట్రాలు వణికించాడు. చాలా పట్టణాలు, నగరాలు వరదనీటిలో మునిగిపోయాయ్. కట్ చేస్తే.. ఇప్పుడు సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇది వానాకాలమా.. ఎండాకాలమా అనే రేంజ్‌లో దంచికొడుతున్నాడు.
దీనికితోడు ఉక్కపోత. దీంతో జనాలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్. దీంతో ఐఎండీ కీలక ప్రకటన చేసింది. మరికొన్ని రోజుల పాటు.. ఏపీ, తెలంగాణలో అసలు వర్షాలు కురిసే అవకాశం లేదని.. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే చాన్స్ ఉందని చెప్పింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో కూడా జూలై నెల చివరి వరకు వర్షాలు కురిశాయ్. ఆ తర్వాత నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. వానలు ఆగిపోయి. ప్రస్తుతం ఏపీలో ఎండలు మండిపోతున్నాయ్.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎంతలా పెరిగాయి అంటే.. వేసవి కాలంలో ఎంత వేడిగా ఉంటుందో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రేంజ్‌లో ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఆగస్ట్ 20వరకు ఇదే పరిస్థితి తప్పకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అటు 31డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. జనాలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మొన్నటి వరకు 15రోజులపాటు వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రత, చలి వాతావరణం ఉండి.. ఇప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగటంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. పొడి వాతావరణంతోపాటు ఎండ తీవ్రత, ఉక్కబోత ఉండటంతో.. తలనొప్పి, జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికితోడు మంచినీళ్లు మారటం, కలుషితం కావటంతో వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.