Rahul Gandhi: పొంగులేటి, జూపల్లికి.. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలేంటి ?
అనుకున్నదే జరిగింది. అంచనా వేసిందే నిజం అయింది. చాలా రోజుల తర్వాత సస్పెన్స్‌కు తెరపడింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పొంగులేటి, జూపల్లి.. ఏ పార్టీలో చేరుతారా అని జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.
తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఇదే వినిపించింది. కాంగ్రెస్‌లోకే తమ అడుగులు అని ఈ మధ్యే లీక్‌లు ఇచ్చిన ఇద్దరు నేతలు.. ఇప్పుడు కన్ఫార్మ్ చేశారు. జూలై 2న కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి.. రాహుల్, సోనియాను ఆహ్వానించి.. ఆ ఇద్దరితో లక్షల మంది జనం ముందు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు ఇద్దరు నేతలు. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ్.
ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరడం అంటే.. హస్తం పార్టీకి కొండంత బలం లెక్కే ! కాంగ్రెస్‌లో చేరబోతున్న ఇద్దరు నేతలకు రాహుల్ గాంధీ ఎలాంటి హామీలు ఇచ్చారనే చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి పొంగులేటితో.. రాహుల్ గాంధీ అండ్ టీమ్ ఎప్పటి నుంచో టచ్‌లో ఉంది. ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి.. రాహుల్ టీమ్ చర్చలు జరుపుతూనే ఉంది. కర్ణాటక ఫలితాల వరకు ఎదురుచూసిన పొంగులేటి.. ఎట్టకేలకు కాంగ్రెస్‌కు జై కొడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో పొంగులేటితో పాటు ఆయన అనుచరులకు టికెట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది. జూపల్లి విషయంలోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీట్ల విషయంలో పెద్ద పీట వేయనుందని టాక్. ఇదంతా ఎలా ఉన్నా.. ఖమ్మం సభకు రాహుల్ గాంధీ వస్తారా లేదా అన్నది ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మరో చర్చ తెరమీదకు వస్తోంది. జూలై 2న సభ విషయంలో మార్పులు ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. రాహుల్ షెడ్యూల్‌కు అనుగుణంగా.. ఖమ్మం సభ తేదీల్లో మార్పులు చోటు చేసుకునే చాన్స్ ఉంది అంటున్నారు. ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో అసలైన ఆట ఇప్పుడు మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.