కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతోంది అంటే అందరి చూపు ఇన్‌కం ట్యాక్స్ స్లాబ్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్‌లో వచ్చే చిన్న చిన్న మార్పులు ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పులు తీసుకువస్తాయి. అందుకే బడ్జెట్‌లో ఈ అంశం చాలా కీలకం. 2024-25 సంవత్సరానికి గానూ లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. ఇన్‌కం ట్యాక్స్ విషయంలో పాత పన్ను విధానంలో మార్పులేమీ చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో కొన్ని శ్లాబులు మారాయి. తాజా శ్లాబుల ప్రకారం 3 లక్షల నుంచి 7 లక్షల ఆదాయంపై 5% పన్ను చెల్లించాలి. గతంలో ఇది 3 నుంచి 6 లక్షల రూపాయలుగా ఉండేది. దీంతోపాటు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను 50 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయలకు పెంచారు. ఇది నిజంగా మిడిల్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ మార్పుల వల్ల 17 వేల 500 రూపాయలు ఆదా అవుతుంది. అయితే పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక 3 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. న్యూ టాక్స్ రెజీమ్‌లో 7 లక్షల వరకు కూడా పన్ను కట్టక్కరలేదు. కొత్త టాక్స్ రెజీమ్‌లో 3 లక్షల రూపాయల వరకు పన్ను లేదు. 3 నుంచి 7 లక్షల రూపాయలవరకు 5% పన్ను విధించారు. ఈ మేరకు 4 లక్షల రూపాయలకు 5% పన్నుచెల్లించాలి. అంటే 20 వేలు చెల్లించాలి. కానీ సెక్షన్ 87A కింద ప్రభుత్వం 20 వేల రూపాయల పన్నును మాఫీ చేస్తుంది. ఇక స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని కూడా 50 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయలకు పెంచారు. దీంతో 7 లక్షల 75 వేల రూపాయల ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా తక్కువ ఇన్‌కం ఉన్న ఉద్యోగులకు చాలా ప్లస్ అయ్యే విషయం అంటున్నారు నిపుణులు.