భారత్,ఆసీస్ టెస్ట్ సిరీస్, మరిచిపోలేని వివాదాలు ఇవే

వరల్డ్ క్రికెట్ లో ఆసీస్ ఆటగాళ్ళంటే స్లెడ్జింగే ఠక్కున గురొస్తుంది. ప్రత్యర్థులను మాటలతో రెచ్చగొట్టి పైచేయి సాధించాలని చూస్తుంటారు. వారి ట్రాప్ లో చిక్కుకున్న జట్లకు ఓటమి తప్పుదు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో పలుసార్లు ఆసీస్ కు భారత ఆటగాళ్ళు ధీటుగా స్పందించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 06:51 PMLast Updated on: Nov 14, 2024 | 6:51 PM

India Aussie Test Series These Are The Controversies That Cannot Be Forgotten

వరల్డ్ క్రికెట్ లో ఆసీస్ ఆటగాళ్ళంటే స్లెడ్జింగే ఠక్కున గురొస్తుంది. ప్రత్యర్థులను మాటలతో రెచ్చగొట్టి పైచేయి సాధించాలని చూస్తుంటారు. వారి ట్రాప్ లో చిక్కుకున్న జట్లకు ఓటమి తప్పుదు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో పలుసార్లు ఆసీస్ కు భారత ఆటగాళ్ళు ధీటుగా స్పందించారు. వారి స్లెడ్జింగ్ కు మాటలతోనే బదులిచ్చి ఇటు ఆటలోనూ వారికి బుద్ధి చెప్పారు. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతున్న వేళ ఇరు జట్ల మధ్య చరిత్రలో నిలిచిపోయిన కొన్ని వివాదాలను ఇప్పుడు చూద్దాం..

1981లో మెల్ బోర్న్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. యా డెన్నిస్ లిల్లీ విసిరిన బంతిని ఎల్బీడబ్ల్యూ ఔట్ గా ఇవ్వడంతో గవాస్కర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. అది ఔట్ కాదని బలంగా నమ్మిన గవాస్కర్ మైదానంలో నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో డెన్నిస్ లిల్లీ వాగ్వాదానికి దిగడంతో కోపం వచ్చిన గవాస్కర్ చేతన్ చౌహాన్ తో కలిసి గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత భారత జట్టు మేనేజర్ షాహిద్ దురానీ, అసిస్టెంట్ మేనేజర్ బాపూ కలిపి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇక 2008లో జరిగిన మంకీగేట్ వివాదం చరిత్రలో నిలిచిపోయింది. తనపై జాత్యహంకార కామెంట్స్ చేశాడంటూ హర్భజన్ పై సైమండ్స్ చేసిన ఆరోపణలు సిరీస్ ను కుదిపేశాయి. ఓ స్థాయిలో సిరీస్ రద్దయ్యే పరిస్థితి కూడా వచ్చింది.భజ్జీపై చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన టీమిండియా సిరీస్ నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరించింది. దీంతో వెనక్కి తగ్గిన ఆసీస్ బోర్డు హర్భజన్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో మళ్ళీ సిరీస్ యథావిధిగా కొనసాగింది.

ఇదిలా ఉంటే సిడ్నీలో 2012లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోహ్లీ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడిపై ఆస్ట్రేలియా అభిమానులు ఇష్టానుసారం కామెంట్స్ చేశారు. దీంతో కోహ్లీకి కోపం వచ్చి తన కుడిచేతి మధ్య వేలును ఆస్ట్రేలియా అభిమానులకు చూపించాడు. కోహ్లీ తీరును తప్పుపడుతూ అప్పట్లో ఆ ఫోటోలను ఆసీస్ మీడియా బ్యానర్ కథనాలుగా ప్రచురించింది. తర్వాత మ్యాచ్ రిఫరీ విచారణ జరిపి కోహ్లీని హెచ్చరించి వదిలేశారు. ఇక 2017లో బెంగళూరు స్టేడియం వేదికగా భారత్,ఆసీస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి రివ్యూ తీసుకోవాలా అంటూ అడగడం తీవ్ర వివాదం రేపింది. దీనిని గమనించిన కోహ్లీ అంపైర్లకు ఫిర్యాదు చేయగా… స్మిత్ ను పెవిలియన్ పంపించేయడంతో ఆసీస్ నవ్వులపాలైంది.

కాగా 2021 ఆసీస్ టూర్ సమయంలో కంగారూ అభిమానులు అతిగా ప్రవర్తించారు. సిడ్నీ టెస్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా.. జాత్యహంకార వ్యాఖ్యలతో తిట్టారు. దీంతో భారత్ జట్టు మేనేజ్ మెంట్ దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. చివరకు స్టేడియం నుంచి ఆరుగురు ఆస్ట్రేలియా అభిమానులను బయటకు పంపించేశారు. భారత్,ఆసీస్ జట్లు ఎప్పుడు తలపడినా అటు గ్రౌండ్ లో ఆటగాళ్ళ మధ్య , ఇటు గ్యాలరీల్లో అభిమానుల మధ్య హాట్ హాట్ వెదర్ కనిపిస్తూ ఉంటుంది.