దెబ్బకు వ్యూహం మారిందిగా ముంబై పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్, న్యూజిలాండ్ మూడో టెస్ట్ ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా నవంబర్ 1 నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్ లో భారత్ ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. తొలి టెస్టులో ఓటమి తర్వాత రెండో టెస్టులో పుంజుకున్నట్టే కనిపించినా కివీస్ స్పిన్ కు చిక్కి పరాజయం పాలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 12:50 PMLast Updated on: Oct 30, 2024 | 12:50 PM

India Change Their Plan For Mumbai Test

భారత్, న్యూజిలాండ్ మూడో టెస్ట్ ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా నవంబర్ 1 నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్ లో భారత్ ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. తొలి టెస్టులో ఓటమి తర్వాత రెండో టెస్టులో పుంజుకున్నట్టే కనిపించినా కివీస్ స్పిన్ కు చిక్కి పరాజయం పాలైంది. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే తొలి సిరీస్ విజయాన్నందుకున్న న్యూజిలాండ్‌ సిరీస్ ను స్వీప్ చేయాలని భావిస్తోంది. దాంతో మూడో టెస్ట్ కూడా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ పిచ్ పై పడింది.

పుణె వేదికగా రెండో టెస్ట్‌లో టర్నింగ్ వికెట్‌తో న్యూజిలాండ్‌ను బోల్తా కొట్టించాలనుకున్న టీమిండియా వ్యూహం బెడిసికొట్టింది. తమ వ్యూహంతో తామే చిక్కుకుని ఓటమి చవిచూసింది. తొలి రోజు నుంచే గింగిరాలు తిరిగిన స్పిన్ ట్రాక్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు. భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొని సాధారణ స్కోర్ నమోదు చేస్తే.. అనంతరం టీమిండియా అదే స్పిన్‌కు విలవిలలాడి తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. దాంతో కివీస్‌కు 103 పరుగుల ఆధిక్యం దక్కింది. ఈ లీడ్ టీమిండియా ఓటమిని శాసించింది. మరోవైపు న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్.. కెరీర్ బెస్ట్ గణంకాలు నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలోనే స్పిన్ పిచ్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ యూటర్న్ తీసుకుంది. మూడో టెస్ట్ జరిగే వాంఖడే మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వికెట్‌ను సిద్దం చేయాలని క్యూరేటర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. రెండో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలించేలా పిచ్ తయారు చేస్తున్నట్లు సమాచారం. స్పిన్ ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పిన్‌తో పాటు బెంగళూరు టెస్ట్‌లో భారత బ్యాటర్లు పేస్ బౌలింగ్‌కు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ రెండు టెస్ట్‌ల పరాజయాల నేపథ్యంలో ముంబై పిచ్‌ తయారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్యాట్, బంతికి సమతూకమైన పోటీ ఉండేలా పిచ్‌ను తయారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.