రివేంజ్ మూములుగా ఉండొద్దు, పింక్ బాల్ టెస్టుపై భారత్ ఫోకస్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఈ సారి టీమిండియా గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 8 వికెట్లతో చెలరేగాడు. జైస్వాల్, కోహ్లీ సెంచరీలతో ఆసీస్ బౌలర్లను చితకొట్టారు. దీంతో తొలి టెస్ట్ విజయంతో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2024 | 06:45 PMLast Updated on: Nov 29, 2024 | 6:45 PM

India Focus On Pink Ball Test

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఈ సారి టీమిండియా గ్రాండ్ విక్టరీతో స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 8 వికెట్లతో చెలరేగాడు. జైస్వాల్, కోహ్లీ సెంచరీలతో ఆసీస్ బౌలర్లను చితకొట్టారు. దీంతో తొలి టెస్ట్ విజయంతో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే మొదటి టెస్టుకు బుమ్రా నాయకత్వం వహించగా రెండో టెస్టు కోసం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే జట్టులో చేరాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ మైదానంలో ప్రారంభం కానుంది. ఇది డే-నైట్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ ని పింక్ బాల్‌తో ఆడతారు. అయితే భారత్‌కి ఇది ఐదో డే-నైట్ టెస్టు మ్యాచ్.

డే-నైట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచ్‌లు ఆడగా, అందులో టీమ్ ఇండియా 3 మ్యాచ్‌లు గెలిచింది. కాగా ఒక మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జట్లతో డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అయితే భారత్ ఆస్ట్రేలియాపైనే ఓటమిపాలైంది. అదికూడా అడిలైడ్ లోనే. కాగా అడిలైడ్ వేదికగా ఆసీస్ పై ఘోర ఓటమి చెందిన కోహ్లీ కోసమైనా రెండో టెస్టులో గెలవాల్సిన అవసరముంది. ఈ టెస్టులో కోహ్లీ రూపంలో ఆసీస్ కు సరైన బుద్ది చెప్పాల్సిన టైమొచ్చింది. అయితే ఆ బాధ్యతను రోహిత్ తీసుకోబోతున్నాడు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్‌తో 2019లో భారత్ తొలి డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ టెస్టులో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 2020 సంవత్సరంలో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ రెండవ డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. 2021లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఇంగ్లండ్‌ తో మూడో డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ టీమ్ ఇండియా విజయానికి దోహదపడ్డాడు. మొత్తం 11 వికెట్లతో ఇంగ్లీష్ బ్యాటర్లను వణికించేశాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ 66 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బెంగళూరు వేదికగా 2022లో శ్రీలంకతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ నాలుగో డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 238 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.