ఆస్ట్రేలియా గడ్డపై భారత బ్యాటర్ల వైఫల్యంతో షాక్ తిన్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. గత కొన్ని సిరీస్ లుగా వెంటాడుతున్న బ్యాటింగ్ వైఫల్యాన్ని అధిగమించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ ను నియమించింది. సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాన్షు కోటక్ కు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. జనవరి 22 నుంచి ఇంగ్లండ్ తో వైట్ బాల్ సిరీస్ ప్రారంభానికి ముందే అతడు కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్, ఇద్దరు అసిస్టెంట్ కోచ్ లు అభిషేక్ నాయర్, రియాన్ టెన్ డస్కాటే ఉన్నారు. అయితే ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ మాత్రం లేడు. ఈ మధ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలి సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో బ్యాటింగ్ కోచ్ ను నియమించింది. సితాన్షు కోటక్ సౌరాష్ట్ర టీమ్ మాజీ కెప్టెన్. భారత దేశవాళీ క్రికెట్ లో అత్యుత్తమ ప్లేయర్స్ లో సితాన్షు కూడా ఒకడు. 1992 నుంచి 2013 మధ్య ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు. 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 47.16 సగటుతో 8061 పరుగులు చేశాడు చేశాడు. అందులో 15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఎ క్రికెట్ లో 42.33 సగటుతో 3083 రన్స్ చేశాడు. రిటైరైన తర్వాత సౌరాష్ట్ర జట్టుకే కోచ్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో బ్యాటింగ్ కోచ్ గా చేశాడు. ఒకప్పటి ఐపీఎల్ టీమ్ గుజరాత్ లయన్స్ కు అసిస్టెంట్ కోచ్ గానూ, గత నాలుగేళ్లుగా ఇండియా ఎ బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. ఆగస్ట్ 2023లో ఐర్లాండ్ తో టీ20 సిరీస్ సమయంలోనూ తాత్కాలికంగా టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నా.. బోర్డు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. సితాన్షు వైపే బీసీసీఐ, గంభీర్ మొగ్గుచూపారు. బ్యాటింగ్ కోచ్ పదవి కోసం సితాన్షు కోటక్ పేరును ఖాయం చేసినట్టు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే అతను జట్టుతో కలిసే అవకాశముందని, త్వరలోనే సితాన్షు నియామకంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేస్తుందని తెలిపారు. గత 8 నెలల నుంచి బ్యాటింగ్ పరంగా భారత ఆటగాళ్ళు నిరాశపరుస్తున్నారు. సీనియర్లు సైతం పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారారు. అందుకే టీమ్ లో ప్రతీ ఆటగాడి బ్యాటింగ్ పై కొత్త కోచ్ ఫోకస్ పెట్టాల్సిందేనని బీసీసీఐ గంభీర్ కు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. సితాన్షు కోటక్ ఆధ్వర్యంలో భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి.[embed]https://www.youtube.com/watch?v=9yWulDmOK-Y[/embed]