బ్యాటర్లు చెలరేగాల్సిందే లంకతో భారత మహిళల కీలకపోరు

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు ఇవాళ కీలక పోరుకు రెడీ అయింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో తలపడబోతోంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఘోరపరాజయం భారత్ రన్ రేట్ అవకాశాలపై గట్టిగానే ప్రభావం చూపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 9, 2024 | 07:08 PMLast Updated on: Oct 09, 2024 | 7:08 PM

India Is Going To Face Sri Lanka In Dubai

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు ఇవాళ కీలక పోరుకు రెడీ అయింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో తలపడబోతోంది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఘోరపరాజయం భారత్ రన్ రేట్ అవకాశాలపై గట్టిగానే ప్రభావం చూపింది. రెండో మ్యాచ్ లో పాక్ ను ఓడించినా రన్ రేట్ లో భారత్ ఇంకా వెనుకబడే ఉంది.సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇవాళ మ్యాచ్‌లోనూ భారత్ ఘనవిజయాన్ని సాధించాల్సిందే. ప్రధానంగా బ్యాటింగ్ గాడిన పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కివీస్‌తో మ్యాచ్‌లో స్మృతి, షఫాలీ, హర్మన్, జెమీమా, రిచా విఫలం కావడంతో భారీ ఓటమి తప్పలేదు. దాని నుంచి కోలుకొని పాక్‌ను ఓడించినా… ఇక్కడా బ్యాటింగ్‌ గొప్పగా సాగలేదు. బౌలర్ల ప్రదర్శనతో పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా జట్టు 18.5 ఓవర్లు తీసుకోవడంతో రన్‌రేట్‌ కూడా పెంచుకునే అవకాశం లేకపోయింది.

దీంతో బ్యాటర్లు చెలరేగి లంకపై భారీ విజయాన్ని అందిస్తే తప్ప సెమీస్ రేసులో భారత మహిళల జట్టు ముందంజ వేసే అవకాశం లేదు. లేడీ సెహ్వాగ్ గా పేరున్న షెఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే మంచి ఆరంభం దక్కుతుంది. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించాల్సిందే. అయితే స్లో పిచ్ లు బ్యాటర్లకు సవాల్ గా మారడంతో ఎలా ఆడతారనేది చూడాలి. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయలేం. లంకపై భారత్ రికార్డు ఘనంగానే ఉన్నా… ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో ఆ జట్టు చేతిలోనే ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది. దీంతో కాస్త అప్రమత్తంగా ఆడితే మంచి విజయాన్ని అందుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు భారత్ గెలవగా, ఓ మ్యాచ్ శ్రీలంక నెగ్గింది.

మరోవైపు ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు భారీ విజయాన్నే సాధించి రన్ రేట్ మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడంతో టీమిండియా సెమీస్ సమీకరణాలు మారిపోయాయి. ఆస్ట్రేలియా 4 పాయింట్లతో దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా… తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ , న్యూజిలాండ్ , భారత్ ఉన్నాయి. తర్వాతి మ్యాచ్ లో భారత్ ఆసీస్ తో తలపడాల్సి ఉండడంతో లంకపై భారీ విజయాన్ని సాధిస్తే మెరుగైన స్థితిలో నిలిచే అవకాశముంటుంది. అయితే ఈ టోర్నీలో పిచ్ లు బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నాయి. దుబాయ్, షార్జాల్లో ఎక్కువగా బౌలర్ల ఆధిపత్యమే సాగుతోంది. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టమవుతోంది. పిచ్‌లు మందకొడిగా ఉండడంతో బంతి బ్యాట్‌ మీదికి రావట్లేదు. స్పిన్నర్లున్న లంకను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారత్ కు ఇబ్బందులు తప్పవు.