గబ్బాలో ఇక వరుణుడే దిక్కు, భారత్ కు ఫాలోఆన్ ముప్పు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం, వరుణుడి అంతరాయం రెండూ కలిసి కొనసాగుతున్నాయి. రెండోరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పరుగుల వరద పారిస్తే... మూడోరోజు తొలి సెషన్ లోనే వారి ఇన్నింగ్స్ కు భారత్ తెరదించింది. కానీ అప్పటికే ఆస్ట్రేలియా భారీస్కోర్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2024 | 07:54 PMLast Updated on: Dec 16, 2024 | 7:54 PM

India Is In Danger Of A Follow On

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం, వరుణుడి అంతరాయం రెండూ కలిసి కొనసాగుతున్నాయి. రెండోరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పరుగుల వరద పారిస్తే… మూడోరోజు తొలి సెషన్ లోనే వారి ఇన్నింగ్స్ కు భారత్ తెరదించింది. కానీ అప్పటికే ఆస్ట్రేలియా భారీస్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. బూమ్రా 6 వికెట్లు తీసినా మిగిలిన బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఫలితంగా ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా సత్తా చాటారు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బూమ్రా 6 వికెట్లు తీసుకోగా…సిరాజ్ 2 , ఆకాశ్ దీప్, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ను ఆసీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. 22 పరుగులకే 3 కీలక వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టారు. ఫోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన జైశ్వాల్ తర్వాతి బంతికే ఔటవగా.. గిల్ కూడా కాసేపటికే వెనుదిరిగాడు. ఆదుకుంటాడని భావించిన కోహ్లీ.. మరోసారి తన వీక్ నెస్ ను కొనసాగిస్తూ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ దశలో రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది.

ఆట తిరిగి ప్రారంభమవ్వగానే.. కమిన్స్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ ఔటయ్యాడు. ఓవైపు వరణుడు.. మరోవైపు వికెట్లు పడుతున్నా.. కేఎల్ రాహుల్ పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు. తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్‌లతో అలరించాడు. అయితే పదే పదే అంతరాయం కలిగించడంతో సోమవారం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. అంచనాలు పెట్టుకున్న గిల్, కోహ్లీ, పంత్ నిరాశపరచడం భారత్ కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇక రాహుల్‌తో పాటు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ.. ఇతర బ్యాటర్లు నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలపైనే భారత్ ఆధారపడి ఉంది. ఫాలో ఆన్ గండం తపపించుకోవాలంటే భారత్ ఇంకా 246 పరుగులు చేయాలి. నాలుగో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తేనే.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి తప్పించుకుంటుంది. అదే సమయంలో వర్షం కూడా ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.