భారత్ , పాక్ క్రికెట్ డీల్, ఛాంపియన్స్ ట్రోఫీపై వీడిన సస్పెన్స్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ కు తెరపడింది. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. తాజాగా ఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సస్పెన్స్ కు తెరపడింది. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. తాజాగా ఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. దీంతో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తోపాటు ఇండియా ఆడే అన్ని మ్యాచ్ లు తటస్థ వేదికలోనే జరుగుతాయి. అంతేకాదు వచ్చే మూడేళ్ల పాటు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ టోర్నీల్లో ఇండియా మ్యాచ్ లు, ఇండియా ఆథిత్యమివ్వబోయే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ మ్యాచ్ లు తటస్థ వేదికల్లోనే జరగనున్నాయి.
అయితే ఐసీసీ సమావేశంలో భారత్, పాకిస్థాన్ లతో కూడిన ట్రయాంగిల్ లేదా క్వాడ్రాంగులర్ సిరీస్ నిర్వహణపైనా చర్చించారు. చర్చల్లో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ టోర్నమెంట్ కు తాము అభ్యంతరం చెప్పబోమని, అయితే తటస్థ వేదిక నిబంధన ఐసీసీ టోర్నీల్లాగే దీనికీ వర్తిస్తుందని మాత్రం ఐసీసీ స్పష్టం చేసింది. ఇలాంటి టోర్నీ నిర్వహణ మొత్తం బీసీసీఐ, పీసీబీ మధ్యే ఉంటుందని తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీకి మరో రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందంతో అన్ని క్రికెట్ బోర్డులు ఊపిరి పీల్చుకున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కొన్నాళ్లుగా పీసీబీ, బీసీసీఐ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకవేళ పాకిస్థాన్ కు ఇండియా రాకపోతే.. తాము కూడా 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ ను బాయ్‌కాట్ చేస్తామని కూడా పీసీబీ హెచ్చరించింది. అయితే బీసీసీఐ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అటు ఐసీసీ కూడా వార్నింగ్ ఇవ్వడంతో పాక్ బోర్డు దిగిరాక తప్పలేదు. చివరికి భారత్ , పాక్ క్రికెట్ ట్రై సిరీస్ కు డీల్ కుదరడంతో ఈ వివాదానికి ఇక్కడితో తెరపడింది