పెర్త్ సవాల్ కు భారత్ రెడీ, తొలి టెస్టుకు తుది జట్టు ఇదే

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. గత రెండు పర్యటనల్లో అదరగొట్టిన టీమిండియా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై కన్నేసింది. అయితే ఈ సారి భారత్ కు అది అంత ఈజీ కాకపోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2024 | 04:51 PMLast Updated on: Nov 20, 2024 | 4:51 PM

India Ready For Perth Challenge This Is The Final Squad For The First Test

క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. గత రెండు పర్యటనల్లో అదరగొట్టిన టీమిండియా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై కన్నేసింది. అయితే ఈ సారి భారత్ కు అది అంత ఈజీ కాకపోవచ్చు. ఆసీస్ పేస్ పిచ్ లపై పుజారా, రహానే వంటి టెస్ట్ స్పెషలిస్టులు లేకపోవడం ప్రధాన కారణం. పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. హిట్ మ్యాన్ స్థానంలో జస్ప్రీత్ బూమ్రా సారథిగా వ్యవహరించనుండగా… ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయపడడంతో అతను కూడా ఆడే అవకాశాలు లేనట్టే. దీంతో తుది జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. తొలి టెస్ట్ కోసం ఇద్దరు ఆటగాళ్ళు అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ కోటాలో టెస్టుల్లో అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో ఇటీవలే బంగ్లాదేశ్ పై టీ ట్వంటీ అరంగేట్రం చేసిన నితీశ్ ఆకట్టుకున్నాడు. దీంతో కోచ్ గంభీర్ అతనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి రెడ్ బాల్ క్రికెట్ కు కూడా రెడీ చేస్తున్నాడు.

టెస్టుల్లో మిడిలార్డర్ కు సంబంధించి భారత్ కు ఆల్ రౌండర్ అవసరం చాలానే ఉంది. అందుకే నితీశ్ కుమార్ రెడ్డిపై గంభీర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే యువ పేసర్ హర్షిత్ రాణా కూడా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టే అవకాశముంది. ఐపీఎల్ లో గంభీర్ మెంటార్ గా వ్యవహించిన కోల్ కత్తా జట్టులో రాణా అద్భుతంగా రాణించాడు. ఆసీస్ పేస్ పిచ్ లపై హర్షిత్ రాణా జట్టుకు అడ్వాంటేజ్ అవుతాడని గంభీర్ భావిస్తుండడంతో పెర్త్ టెస్టులో ఆడించే ఛాన్సుంది. ఇదిలా ఉంటే రోహిత్ స్థానంలో ఓపెనర్ గా కెఎల్ రాహుల్ రానున్నాడు. జైశ్వాల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. వన్ డౌన్ లో దేవదూత్ పడిక్కల్ కు చోటు దక్కే ఛాన్సుంది. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధృవ్ జురెల్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో వస్తారు. వికెట్ కీపర్ గా పంత్ ఉన్నప్పటకీ… జురెల్ భారత్ ఏ జట్టుతో సిరీస్ లో సత్తా చాటడంతో బ్యాటర్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇక ఆల్ రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ ఆల్ రౌండర్ గా రవిచంద్రన్ అశ్విన్ కే ప్రయారిటీ దక్కనుంది. జడేజా కంటే కూడా అశ్విన్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీలను కట్టడి చేసేందుకు అశ్వినే మంచి ఛాయిస్ గా టీమిండియా భావిస్తోంది. అటు పేస్ ఎటాక్ ను కెప్టెన్ బూమ్రా లీడ్ చేయనుండగా… మహ్మద్ సిరాజ్ , హర్షిత్ రాణా చోటు దక్కించుకోనున్నారు. సిరాజ్ కు ఆసీస్ పిచ్ లపై అద్భుతమైన రికార్డుంది. ముఖ్యంగా గత పర్యటనలో బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ విజయంలో సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఇటీవల స్వదేశంలో కివీస్ పై నిరాశపరిచినప్పటకీ.. ఆసీస్ పిచ్ లపై అతనికి ఉన్న రికార్డు దృష్ట్యా సిరాజ్ కీలకం కానున్నాడు. అయితే తుది జట్టులో ప్రసిద్ధ కృష్ణకు చోటు దక్కుతుందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. గత పర్యటనలో ప్రసిద్ధకృష్ణ తన పేస్ తో సత్తా చాటడమే దీనికి కారణం. అదే జరిగితే హర్షిత్ రాణా బెంచ్ కే పరిమితమవ్వొచ్చు.