Top story: చైనా, పాకిస్థాన్ కు ఇక దబిడి దిబిడే…!

సరిహద్దుల్లో తోకజాడించే పాక్, దానికి వంతపాడే గుంటనక్క చైనాలకు ఇక చుక్కలే. సరికొత్త వేటగాళ్లు రాబోతున్నారు. సరిహద్దుల్లో ఈ రెండు దేశాల ఆగడాలకు చెక్ చెప్పే ప్రిడేటర్ డ్రోన్లు మన సైన్యం చేతికి అందబోతున్నాయి... మెరుపువేగంతో దాడి చేసి ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఈ డ్రోన్లు మన చేతికి వస్తే చైనా ఆధిపత్యానికి గండి పడినట్లే... ఇంతకీ ఏంటి ఈ డ్రోన్ల ప్రత్యేకత...? ఇవి అంత గొప్పవా....?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2024 | 12:43 PMLast Updated on: Oct 16, 2024 | 12:43 PM

India Signs Deal With Us To Procure 31 Predator Drones

సరిహద్దుల్లో తోకజాడించే పాక్, దానికి వంతపాడే గుంటనక్క చైనాలకు ఇక చుక్కలే. సరికొత్త వేటగాళ్లు రాబోతున్నారు. సరిహద్దుల్లో ఈ రెండు దేశాల ఆగడాలకు చెక్ చెప్పే ప్రిడేటర్ డ్రోన్లు మన సైన్యం చేతికి అందబోతున్నాయి… మెరుపువేగంతో దాడి చేసి ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఈ డ్రోన్లు మన చేతికి వస్తే చైనా ఆధిపత్యానికి గండి పడినట్లే… ఇంతకీ ఏంటి ఈ డ్రోన్ల ప్రత్యేకత…? ఇవి అంత గొప్పవా….?

ప్రిడేటర్ డ్రోన్…. ఓ రకంగా మానవ రహిత యుద్ధ విమానాల్లాంటివి. అత్యంత ఆధునికమైనవి. వీటికి మరో పేరు హంటర్ డ్రోన్స్. శత్రువు గుర్తించేలోగానే దెబ్బకొట్టి వెనక్కు రాగలగడం వీటి ప్రత్యేకత. అందుకే ఈ డ్రోన్లకు ఇంత గిరాకీ. అమెరికా కూడా వీటిని ఎవరికి పడితే వారికి అమ్మదు. భారీగా డబ్బులు చెల్లిస్తామన్నా ఇవ్వదు. సుదీర్ఘ చర్చల తర్వాతే ప్రిడేటర్ డ్రోన్లను భారత్ కు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు అయిపోయాయి. మన లెక్కల్లో చెప్పాలంటే 32వేల కోట్లతో 31ప్రిడేటర్ MQ-9B అందించేందుకు అంగీకరించింది. మొత్తం కలుపుకుంటే ఇది దాదాపు 35వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఒక్కో డ్రోన్ ఖరీదు వేయి కోట్లకు పైనే… దీంతో పాటు భారత్ లో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ సెంటర్ ను కూడా అమెరికా ఏర్పాటు చేస్తుంది. 15ప్రిడేటర్లను నేవీకి మిగిలిన వాటిని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు అందిస్తారు. చెన్నై, పోరుబందర్, సరస్వ, గోరఖ్ పూర్ లో వీటిని ఉంచుతారు.

ఒక్కో డ్రోను ఖరీదు వేయి కోట్లు ఇంకా చెప్పాలంటే 11వందల కోట్లకు పైనే.. ఆ డ్రోన్ ప్రత్యేకతలు తెలుసుకుంటే అది పెద్ద మొత్తం కాదని మీరే అంటారు. ఇవి అత్యంత ఆధునికమైనవి. ప్రపంచంలోనే ఎన్నో రకాల డ్రోన్లున్నా వీటికి సాటిరావు. వీటి ప్రత్యేకత ఏంటంటే సౌండ్ లెస్ ఆపరేషన్. లక్ష్యానికి అత్యంత చేరువగా వచ్చేవరకు కూడా వీటిని ఎవరూ గుర్తించలేరు. అంత నిశ్శబ్దంగా పనిచేసుకుపోతాయి. అవసరమైతే భూమికి 250మీటర్ల ఎత్తువరకు కూడా వచ్చేస్తాయి. అయినా సరే వాటి శబ్దం ఎవరికీ వినిపించదు. అలాగని నెమ్మదిగా వెళతాయా అంటే అదీ కాదు. వీటి వేగం గంటకు 442కిలోమీటర్లు. భూమికి ఎంత చేరువగా వస్తాయో అంత దూరంగానూ వెళ్లగలవు. భూమికి దాదాపు 50వేల అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలవు. కమర్షియల్ విమానాల కంటే ఇవి ఎక్కువ ఎత్తులో ఎగురుతాయి. ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లతో పాటు ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైళ్లను కూడా మోసుకెళ్లగలవు. నాలుగు హెల్ ఫైర్ మిస్సైళ్లతో పాటు 450కేజీల బాంబులను తీసుకెళతాయి. ఒక్క సెకను వ్యవధిలోనే మూడు మిస్సైళ్లను ప్రయోగించగలగడం దీని మరో స్పెషాలిటీ. 2022లో కాబూల్ నడిబొడ్డున అల్ ఖైదా నాయకుడు అల్ జవహరిని ఈ డ్రోన్ దాడితోనే మట్టుబెట్టారు.

ప్రిడేటర్ డ్రోన్లకున్న మరో ప్రత్యేకత అత్యాధునిక కెమెరాలు. ఒక్కో డ్రోన్ లో 368 కెమెరాలుంటాయి. 50లక్షల పిక్సెల్ తో చిత్రాలు చిత్రీకరించగలగడం వీటి ప్రత్యేకత. అంతేకాకుండా దీనికున్న రాడార్లు 100కిలోమీటర్ల దూరం వరకు నిఘా వేయగలవు. ఇందులోని అత్యాధునిక సాఫ్ట్ వేర్ ముప్పును పసిగట్టడంతో పాటు ఒకేసారి 12మూవింగ్ టార్గెట్స్ పై నిఘా పెడుతుంది. అంతేకాదు గాలిలో ఏకబిగిన 40గంటల పాటు ఉండగలగడం వీటి ప్రత్యేకత. పూర్తిస్థాయి ఆయుధాలతో అయితే 28గంటలు నాన్ స్టాప్ జర్నీ చేస్తుంది. ఇంధనం నింపకుండా 3వేల 220కిలోమీటర్లు వెళ్లగలవు. భారత్ ఇప్పటికే ప్రిడేటర్లలో మరో రకమైన సీగార్డియన్ డ్రోన్లను జనరల్ అటామిక్స్ నుంచి అద్దెకు తీసుకుని వినియోగిస్తోంది.

పాక్, చైనా సరిహద్దుల్లో ఈ డ్రోన్లను వినియోగించాలని భారత్ భావిస్తోంది. బోర్డర్ లో మానవ రహిత గస్తీకి ఇవి ఉపయోగపడనున్నాయి. పాక్, చైనాతో సుదీర్ఘ సరిహద్దు ఉండటంతో కొన్నిచోట్ల ఆక్రమణలు, చొరబాట్లు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రిడేటర్లతో చెక్ పెట్టొచ్చని సైన్యం భావిస్తోంది. దానికి తోడు ఉగ్రవాద స్థావరాలపై డ్రోన్ దాడులు పక్కాగా జరపొచ్చు. సముద్ర జలాల్లో 3వేల కిలోమీటర్ల దూరం వరకు యాంటీ పైరెట్ ఆపరేషన్లకు వీటిని వినియోగించుకోవచ్చు. చైనా దగ్గర కూడా ఇలాంటి డ్రోన్లు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే అవి ప్రిడేటర్ స్థాయికి తగినవి కాదని అంటున్నారు. ఇప్పుడు అవి మనకు అందితే చైనాపై ఆధిపత్యం ప్రదర్శించొచ్చు. అందుకే వీటికోసం సైన్యం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చైనా కాస్కో ఇక. తోక జాడిస్తే హంటర్లు వేటాడతాయ్…