India TV Survey: ఏపీ, తెలంగాణలో గెలిచేదెవరు… ఓడేదెవరు…? ఇండియా టీవీ సర్వే ఏం చెబుతోంది…!
లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. ఎన్నికల వేడి అంతకంతకూ రాజుకుంటోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితేంటి...? ఏపీలో వైసీపీ హవా తగ్గిందా...? టీడీపీ పుంజుకుందా...? జనసేన సంగతేంటి...?
లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. ఎన్నికల వేడి అంతకంతకూ రాజుకుంటోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితేంటి…? ఏపీలో వైసీపీ హవా తగ్గిందా…? టీడీపీ పుంజుకుందా…? జనసేన సంగతేంటి…? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగైందన్న ప్రచారం నిజమేనా…? కమలం హవా తగ్గిందా… పెరిగిందా…? బీఆర్ఎస్ మరోసారి సత్తా చాటుతుందా…? ఈ ప్రశ్నలకు ఇండియా టీవీ, సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ సమాధానాలు కనుక్కునే ప్రయత్నం చేసింది.
ఏపీని తీసుకుంటే ఇండియాటీవీ, సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే అధికార వైసీపీకి 18 సీట్లు వస్తాయట. ఇక టీడీపీకి 7 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే వైసీపీ నాలుగు స్థానాలు కోల్పోతే ఆ నాలుగింటినీ టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ చెబుతోంది. ఇక వైసీపీకి 46శాతం, బీజేపీకి 36శాతం ఓట్లు రావొచ్చట. బీజేపీకి కేవలం 8శాతం ఓట్లు వస్తాయట. అయితే జనసేనను మాత్రం ఈ సర్వే పట్టించుకున్నట్లు లేదు. ఆ పార్టీకి సీట్లు, ఎంత శాతం ఓట్లన్నది అసలు చెప్పలేదు. అంటే అసలు జనసేనను పరిగణలోకి తీసుకోలేదా అన్నది తేలాల్సి ఉంది.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏపీలో ఇటీవల జనసేన గ్రాఫ్ కొంతమేర పెరిగింది. పవన్ కల్యాణ్ దూకుడు కూడా పెరిగింది. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న దానిపై క్లారిటీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జనసేన 18 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీకి 6.3శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చింది కేవలం 0.96శాతం. అలాంటప్పుడు ఈసారి బీజేపీకి 8శాతం ఓట్లు వస్తాయని ఈ ఒపీనియన్ పోల్ చెబుతోంది. అంటే జనసేన-బీజేపీ కూటమిని పరిగణలోకి తీసుకుందా అన్నదానిపై క్లారిటీ లేదు. అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితిని మాత్రమే పరిగణలోకి తీసుకుంది. ఈ సర్వే ప్రకారం చూసినా ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే మాత్రం ఆ మూడు పార్టీల ఓట్‌షేర్ దాదాపు వైసీపీకి సమానమవుతుంది. అదే జరిగితే వైసీపీకి కష్టాలు తప్పవు.
తెలంగాణలోనూ ఇండియా టీవీ సర్వే మరింత ఆసక్తికర సర్వేను ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17లోక్‌సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక్క స్థానాన్ని గెలిచాయి. ఈసారి బీఆర్ఎస్‌కు 8, బీజేపీకి 6, కాంగ్రెస్‌కు 2 లోక్‌సభ సీట్లు రావొచ్చన్నది ఈ ఒపీనియన్ పోల్ అంచనా. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కో సీటును కోల్పోతాయన్నమాట. ఇక ఎంఐఎం తన ఒక్క సీటును నిలబెట్టుకుంటుంది. బీఆర్ఎస్‌కు 40శాతం, బీజేపీకి 28శాతం, కాంగ్రెస్‌కు 23శాతం ఓట్లు రావొచ్చని లెక్కగట్టింది. అంటే గత ఎన్నికలతో పోల్చితే బీఆర్ఎస్‌కు 1.29శాతం ఓట్లు తగ్గుతాయి. ఇక కాంగ్రెస్ ఏకంగా 6శాతం ఓట్లు కోల్పోతుంది. ఇక బీజేపీకి దాదాపు 9శాతం ఓట్లు పెరుగుతాయని ఈ సర్వే చెబుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ భారీగా పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఇటవలి రాహుల్‌గాంధీ సభ తర్వాత కాంగ్రెస్‌లో జోష్ బాగా పెరిగింది. తాము అధికారంలోకి వచ్చేనట్లే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నేతల మధ్య దూరం కాస్త తగ్గింది. లేదా తగ్గినట్లు నటిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఈ ఒపీనియన్ పోల్ చెప్పడం మాత్రం ఆసక్తిని రేపుతోంది. అలాగే బీజేపీలో కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్ తొలగింపు తర్వాత పార్టీలో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యకర్తల్లో కూడా కాస్త నైరాశ్యం నెలకొంది. కానీ ఈ ఒపీనియన్ పోల్ మాత్రం బీజేపీ గ్రాఫ్ పెరిగినట్లు చెప్పడం ఆసక్తిని రేపుతోంది. నెంబర్ వన్‌లో ఉంటామంటున్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోతుందని చెప్పడం కూడా ఆలోచించాల్సిన అంశమే.
ఇండియా టీవీ సర్వే ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతపరిస్థితి ఇది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పరిస్థితి మారుతుంది. నేతలు గోడలు దూకుతారు. అసంతృప్తులు మొదలవుతాయి. మరి ఎన్నికల సమయానికి ఇదే పరిస్థితి ఉంటుందా లేక మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.