తీరు మారని భారత బ్యాటర్లు, సిడ్నీలో ఆసీస్ జోరు

ఆస్ట్రేలియా టూర్ లో భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. సిరీస్ సమం చేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన చివరి టెస్టులోనూ మన బ్యాటర్లు నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ తడబడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2025 | 04:15 PMLast Updated on: Jan 04, 2025 | 4:15 PM

Indian Batsmen Remain Unchanged Aussies Dominate In Sydney

ఆస్ట్రేలియా టూర్ లో భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. సిరీస్ సమం చేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన చివరి టెస్టులోనూ మన బ్యాటర్లు నిరాశపరిచారు. తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ తడబడింది. కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరుకున్నారు. దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. సిడ్నీలో రెండోరోజు మాత్రం భారత బౌలర్లు అదరగొట్టేశారు. మొదటిరోజు చివర్లో వికెట్ తీసిన జోష్ ను కొనసాగిస్తూ ఆసీస్ కు మన పేసర్లు చుక్కలు చూపించారు. సమిష్టిగా రాణిస్తూ వారిని దెబ్బకొట్టారు. లబూషేన్ , కొన్ స్టాస్ తో పాటు డేంజర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను సైతం తొలి సెషన్ లోనే పెవిలియన్ కు పంపించారు. దీంతో ఆస్ట్రేలియా 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆస్ట్రేలియా అరంగేట్ర బ్యాటర్ వెబ్‍స్టర్ కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. నిలకడగా ఆడుతూ తన తొలి మ్యాచ్‍లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరో వైపు స్టీవ్ స్మిత్ కూడా పోరాడడంతో ఆసీస్ కోలుకునేలా కనిపించింది. ఈ క్రమంలో స్మిత్‍ను భారత యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేశాడు.
లంచ్ తర్వాత భారత కెప్టెన్ బుమ్రా గాయంతో మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. రెండో సెషన్ లో భారత బౌలర్లు మళ్ళీ పుంజుకుని ఆసీస్ ను కట్టడి చేశారు. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‍లో బ్యాట్‍తో నిరాశ పరిచినా.. బంతితో రాణించాడు. ప్యాట్ కమిన్స్ .మిచెల్ స్టార్క్ ను ఔట్ చేశాడు. చివరికి 181 పరుగులకు ఆసీస్ ఆలౌటైంది. టీమిండియాకు నాలుగు పరుగుల ఆధిక్యం దక్కింది.

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటారు. బుమ్రా, నితీశ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. తర్వాత భారత్ దూకుడుగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్ తొలి వికెట్ కు వేగంగా ఏడు ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. అయితే ఓపెనర్లు ఇద్దరూ 5 పరుగుల తేడాతో ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ మళ్ళీ గాడి తప్పింది. కాసేపటికే విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ 6 పరుగులకే ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ తో పంత్ రెచ్చిపోయాడు. భారీ షాట్లు కొడుతూ కంగారూలకు చుక్కలు చూపించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన పంత్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 98 బంతులాడి 40 పరుగులే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు.

అయితే చివరి సెషన్ లో ఆసీస్ బౌలర్లు బౌన్స్ బ్యాక్ అయ్యారు. దూకుడుగా ఆడుతున్న పంత్ ను ఔట్ చేశారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 రన్స్ కు పంత్ ఔటవగా… మెల్ బోర్న్ సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డి కూడా విఫలమయ్యాడు. ఫలితంగా రెండోరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. దీంతో పంత్ మెరుపులు మెరిపించినా మిగిలిన బ్యాటర్ల వైఫల్యంతో ప్రస్తుతం ఆసీస్ దే పైచేయిగా ఉంది. క్రీజులో ఉన్న జడేజా, వాషింగ్టన్ సుందర్ మూడోరోజు ఎంతవరకూ నిలదొక్కుకుంటారనే దానిపై మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కనీసం 250 ప్లస్ టార్గెట్ ఉంచగలిగితే భారత్ కు పోరాడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గాయంతో గ్రౌండ్ ను వీడిన బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయకుంటే మాత్రం ఆసీస్ కు అడ్వాంటేజ్ గానే చెప్పాలి.