Indian Railway New Rule: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా..? అయితే ఈ రూల్ మీకోసమే..!
యాత్రికన్ కృపయా ధ్యాన్ దే.. అనే సౌండ్ రోజూ ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. ఇక రైలు ప్రయాణాల విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రతి నిమిషంలో చాలా సార్లు మనకు వినిపిస్తూనే ఉంటారు. ఇందులో కొన్ని సార్లు స్టాఫ్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ.. ప్రయాణీకులకు అవసరమైన ముఖ్యమైన సూచనలు కూడా చేస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనది టికెట్ లేని ప్రయాణం నేరం తగిన జరిమానాతో పాటూ జైలుశిక్షకూడా పడుతుంది అని చెబుతూ ఉంటారు. ప్లాట్ ఫాం టికెట్ అయినా, ప్రయాణ టికెట్ అయినా ఏదో ఒక్కటి తప్పని సరిగా ఉండి తీరాలి.
సాధారణంగా రైలు ప్రయాణానికి ఎక్కువ మంది సుముఖత చూపిస్తారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి. వ్యక్తిగత సౌకర్యాల విషయమే కాకుండా ప్రయాణం కూడా సాఫీగా సాగుతుందని దీనిని ఎంచుకునే వారూ ఉంటారు. కొందరైతే టిక్కెట్ లేకుండా ప్రయాణాలు కూడా చేస్తారు. అలా చేసే వారికి టీసీ చెకింగ్ కి వచ్చినప్పుడు తగిన జరిమానాలు విధిస్తారు. అప్పుడు టీసీ నుంచి తప్పించుకునేందుకు చాలా రకాలా కారణాలే చెబుతారు.
ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. రైలు కదులుతున్న తొందరలో ఎక్కడ ప్రయాణాన్ని మిస్సైపోతామో అనే కంగారులో బోగీలోకి ఎక్కేసి కూర్చుంటాం. ఇలా కూర్చొన్న సమయంలో టికెట్ క్లర్క్ వచ్చినప్పుడు భయపడాల్సిన పనిలేదు. మన వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డుల్లో ఏదో ఒకదానితో అప్పటికప్పుడే ప్రయాణం మధ్యలో టికెట్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రయాణ ధరను టీసీకి చెల్లిస్తే చాలు. దీనికి అదనంగా ఎలాంటి జరిమానా చెల్లించనవసరం లేకుండా ఉండేలా రైల్వేశాఖ ఈ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.
దీనిని గతంలో తీసుకొచ్చినప్పటికీ 2జీ నెట్వర్క్ సహాయంతో పనిచేసేది. చిన్న చిన్న స్టేషన్లలో ఇది సరిగ్గా పనిచేసేది కాదు. ప్రస్తుతం 5జీ అందుబాటులోకి వచ్చిన్న సందర్భంగా 4జీ టెక్నాలజీని ఉపయోగించుకొని స్వైపింగ్ మిషన్లను టీసీల వద్ద ఉంచుతున్నారు. దీంతో సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. సదరు ప్రయాణికుడు ఎక్కడైతే ఎక్కుతారో ఆ ప్రదేశం నుంచే అతను చేరుకునే గమ్యస్థానం వరకూ అయ్యే టికెట్ వెలను లెక్కగడతారు. ఈ టికెట్ ను తీసుకోవడం వల్ల రాబోయే ముందు స్టేషన్లలో ఎవరు చెకింగ్ కి వచ్చినా భయపడకుండా ధైర్యంగా తమ ప్రయాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఈ సరికొత్త విధానానికి ఇండియన్ రైల్వే శ్రీకారం చుట్టింది.