ఆసక్తికరంగా WTC ఫైనల్ రేస్ దూసుకొచ్చిన సౌతాఫ్రికా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ కు సంబంధించిన ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టీమిండియా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉండడంతో వీటికే ఎక్కువ అవకాశాలున్నాయని అందరూ అంచనాకు వచ్చేశారు. కానీ బెంగళూరు టెస్ట్ ఓటమితో భారత్ స్థానం మారకున్నప్పటకీ... గెలుపు శాతం తగ్గింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 25, 2024 | 03:54 PMLast Updated on: Oct 25, 2024 | 3:54 PM

Interestingly The Wtc Final Race South Africa On The Rise

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 సీజన్ కు సంబంధించిన ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. టీమిండియా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉండడంతో వీటికే ఎక్కువ అవకాశాలున్నాయని అందరూ అంచనాకు వచ్చేశారు. కానీ బెంగళూరు టెస్ట్ ఓటమితో భారత్ స్థానం మారకున్నప్పటకీ… గెలుపు శాతం తగ్గింది. అదే సమయంలో మిగిలిన జట్లు ముందంజ వేశాయి. తాజాగా సౌతాఫ్రికా కూడా రేసులోకి దూసుకొచ్చింది. బంగ్లాదేశ్ పై తొలి టెస్ట్ గెలిచిన సఫారీలు ఇప్పుడు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఏ జట్టు ఫైనల్ కు చేరుతుందనేది టెన్షన్ పెంచుతోంది. తాజాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 12 మ్యాచ్ లలో 8 గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. ప్రస్తుతానికి సేఫ్ పొజిషన్ లో ఉన్న రోహిత్ సేన ఫైనల్ చేరాలంటే ఇంకా నాలుగు గెలవాల్సిందే

కివీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లో తప్పక గెలవడంతో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లో కనీసం రెండు టెస్టుల్లో విజయం సాధించాలి. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా సైతం రోహిత్‌ సేన మాదిరే.. 12 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచి, మూడు ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. అయితే, వివిధ మ్యాచ్‌లలో స్లో ఓవర్‌ రేటు తదితర కారణాల వల్ల ఆస్ట్రేలియా పాయింట్లలో కోత పడటంతో ప్రస్తుతం ఖాతాలో 90 పాయింట్లు ఉన్నాయి. విజయాల శాతం 62.50గా ఉంది. మూడో స్థానంలో ఉన్న శ్రీలంక ఖాతాలో 60 పాయింట్లు ఉండగా… సౌతాఫ్రికా నాలుగో ప్లేస్ లో నిలిచింది. సౌతాఫ్రికా తర్వాత బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు ఆడటంతో పాటు శ్రీలంకతో రెండు, పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.

బంగ్లాపై తొలి టెస్టు గెలిచిన సఫారీ టీమ్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా ఖాతాలో 40 పాయింట్లు ఉండగా…. విజయాల శాతం 47.62గా ఉంది. ఈ సీజన్‌లో సౌతాఫ్రికాకు ఇంకా ఐదు టెస్టులు మిగిలి ఉన్నాయి. వీటన్నింటిలో గెలిచిందంటే కచ్చితంగా టాప్‌-2కు చేరుకునే అవకాశం ఉంటుంది. టీమిండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా నాలుగు గెలిచినా రేసులో ఉండగలుగుతుంది. ఓవరాల్ గా ఒక ఫైనల్ బెర్త్ టీమిండియాకు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉండగా… మిగిలిన బెర్త్ కోసం మాత్రం పోటీలో నాలుగు జట్లున్నాయి. ఆసీస్ కు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు సవాల్ విసురుతున్నాయి. ఏడాది చివరికల్లా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తులపై దాదాపు క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.