TS Inter Exams 2024: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధనలో మార్పు..
ఒక్క నిమిషం పరీక్షకు ఆలస్యంగా వచ్చినా.. విద్యార్థుల్ని హాల్లోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొందరు పరీక్షలు రాయలేకపోతున్నారు.

TS Inter Exams 2024: ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అయితే, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఒక్క నిమిషం నిబంధన ఇబ్బందికరంగా మారింది. ఒక్క నిమిషం పరీక్షకు ఆలస్యంగా వచ్చినా.. విద్యార్థుల్ని హాల్లోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కొందరు పరీక్షలు రాయలేకపోతున్నారు. ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేకపోయామని కొందరు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరగాల్సి వచ్చింది. తాజాగా ఒక నిమిషం నిబంధన కారణంగా పరీక్షకు వెళ్లలేకపోవడంతో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ నిబంధనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం నిబంధనను సడలించింది.
ఇకపై విద్యార్థులకు ఐదు నిమిషాల నిబంధన అమలు చేయనున్నారు. అంటే.. శనివారం నుంచి జరిగే పరీక్షలకు ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ విద్యార్థులకు స్వల్ప ఊరట కలుగుతుంది. ఒత్తిడినుంచి ఉపశమనం దొరుకుతుందని అధికారులు అంటున్నారు.