వేలాది కోట్ల పెట్టుబడి… ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా ?
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఐపీఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు బీసీసీఐకి, ఇటు ఆటగాళ్ళకూ కాసులతో పాటు ఆటపరంగానూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన లీగ్ ఇది...
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఐపీఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు బీసీసీఐకి, ఇటు ఆటగాళ్ళకూ కాసులతో పాటు ఆటపరంగానూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన లీగ్ ఇది… అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన యాజమాన్యాలకు ఆదాయం ఎలా వస్తుందన్నది చాలా మందికి డౌట్… బిడ్డింగ్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టే ఫ్రాంచైజీ ఓనర్లకు ఇన్ కమ్ మాత్రం చాలా రూపాల్లో తిరిగి వస్తుంది. ఐపీఎల్‌లో మీడియా హక్కుల ద్వారానే ఫ్రాంచైజీలకు అత్యధిక ఆదాయం వస్తుంది. ఐపీఎల్ నిర్వహణలో వచ్చే ఆదాయం మొత్తంలో 60 నుంచి 70 శాతం ఆదాయం మీడియా హక్కుల ద్వారానే లభిస్తుంది. ఈ సారి బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ తో బీసీసీఐకి 48 వేల 390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. దీని ప్రకారం ఏడాదిలో బీసీసీఐకి మీడియా హక్కుల ద్వారా సుమారు 9,670 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ వచ్చిన ఆదాయంలో 50 శాతం బీసీసీఐకి వెళ్ళగా.., 45 శాతం ఫ్రాంచైజీలకు, 5 శాతం ప్రైజ్ మనీకి అందజేస్తారు. ఈ లెక్కన ఒక్కో ఫ్రాంచైజీకి సుమారు 459 కోట్ల ఆదాయం లభిస్తోంది.
మీడియా హక్కులతో పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం లభిస్తుంది. ఇవి కాకుండా ప్రతి ఫ్రాంచైజీకి కొంతమంది ప్రత్యేక స్పాన్సర్లు ఉంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలపై ఆ స్పాన్సర్ల పేర్లు కనిపిస్తుంటాయి. ఇలా తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకుంటాయి. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ ద్వారా అంటే టికెట్ల అమ్మకంతో కొంత ఆదాయం వస్తుంది. టికెట్లు అమ్మగా వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలకే వెళుతుంది. ప్రైజ్ మనీ ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయాన్ని పొందుతాయి. అంతేకాకుండా ఆటగాళ్లను మార్చుకోవడం, తమ బ్రాండ్ టీషర్టులు, క్యాప్‌లు, ఇతర ఆట వస్తువులను విక్రయించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు ఆదాయం ఆర్జిస్తాయి. దీనితో పాటు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ద్వారాను ఫ్రాంచైజీలకు ఇన్ కమ్ వస్తుంది. ఎంత బ్రాండ్ వాల్యూ పెరిగితే ఆయా ఫ్రాంచైజీలకు అంత ఆదాయం వస్తుంది.