రియాద్ లో ఐపీఎల్ వేలం ? సౌదీ సిటీకే బీసీసీఐ మొగ్గు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ఈ సారి విదేశాల్లో జరగడం ఖాయమైంది. వేలానికి ఆతిథ్యమిచ్చే జాబితాలో పలు పేర్లు వినిపించాయి. సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ తో పాటు సింగపూర్, లండన్ వంటి పేర్లు వినిపించినా చివరికి రియాద్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 23, 2024 | 01:43 PMLast Updated on: Oct 23, 2024 | 1:43 PM

Ipl Auction In Riyadh Bcci Favors Saudi City

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ఈ సారి విదేశాల్లో జరగడం ఖాయమైంది. వేలానికి ఆతిథ్యమిచ్చే జాబితాలో పలు పేర్లు వినిపించాయి. సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ తో పాటు సింగపూర్, లండన్ వంటి పేర్లు వినిపించినా చివరికి రియాద్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. సౌదీఅరేబియా రాజధానిగా ఉన్న రియాద్ కు ఫైనాన్షియల్ హబ్ గానూ పేరుంది. గతేడాది వేలం యూఏఈలోని దుబాయ్ వేదికగా జరిగింది. ఈ సారి కూడా దుబాయ్ పేరు వినిపించినా మరోసారి అక్కడే నిర్వహించడానికి బోర్డు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. వేదికను ఖరారు చేసుకోవడమే బీసీసీఐకి పెద్ద సవాల్…ఎందుకంటే బోర్డు పెద్దలు, 10 ఫ్రాంచైజీల ప్రతినిధులతో పాటు బ్రాడ్ కాస్టింగ్ ప్రతినిధులకూ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. నిజానికి లండన్, దుబాయ్ కంటే కూడా సౌదీ అరేబియాలోనే నిర్వహణ ఖర్చు ఎక్కువ… అయినప్పటకీ బీసీసీఐ రియాద్ కే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ఇప్పటికే బీసీసీఐ ప్రతినిధులు రియాద్ ను సందర్శించినట్టు తెలుస్తోంది. రియాద్ లో వేదికను ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టింగ్ ప్రతినిధులకు ఏర్పాట్లను ఫైనలైజ్ చేయనున్నారు. ఐపీఎల్ వేలం విదేశాల్లో జరగడం ఇది రెండోసారి. గతంలో దుబాయ్ లోని కోకాకోలా ఎరేనాలో ఆక్షన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఐపీఎల్ క్రేజ్ ను మరిన్ని దేశాల్లో విస్తరించే ఉద్దేశంతోనే వేలాన్ని ఇండియా బయట నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇంత‌కుముందు 2022లో మెగా వేలం జ‌రిగింది. ఆన‌వాయితీ ప్ర‌కారం మూడేళ్ళ త‌ర్వాత మళ్ళీ మెగా ఆక్షన్ జరగబోతోంది. 17వ సీజ‌న్ కు ముందు జరిగిన మినీ వేలంలో మిచెల్ స్టార్క్ రికార్డు ధ‌ర ప‌ల‌క‌గా.. ప్యాట్ క‌మిన్స్ రెండో స్థానంలో నిలిచాడు. ఈసారి మెగా వేలం కావడంతో ఏ ప్లేయర్ రికార్డు ధర పలుకుతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేసింది. గతంతో పోలిస్తే ఈ సారి ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశమిచ్చింది. ఇక బోర్డు వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 24 నుంచి 26 మధ్యలో మెగా వేలం జరిగే అవకాశముంది. ఆ సమయంలో టీమిండియా ఆసీస్ టూర్ లో తొలి టెస్ట్ ఆడుతూ ఉంటుంది.