క్రికెట్ అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభ తేదీపై క్లారిటీ వచ్చింది. ఈ మెగా క్రికెట్ కార్నివాల్ ఎప్పటిలానే సమ్మర్ లో అభిమానులకు కిక్ ఇవ్వబోతోంది. ఈ సారి మార్చి 21 నుంచి ఐపీఎల్ సీజన్ షురూ కానుంది. బీసీసీఐ ఎస్ జీఎం సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే బీసీసీఐ పూర్తి షెడ్యూల్ ప్రకటించనుందని చెప్పారు. ఫైనల్ మే 25న జరగనుందని సమాచారం. గతేడాది మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాగా.. ఈసారి ఒక రోజు ముందే ప్రారంభం కానుంది. సంప్రదాయం ప్రకారం తొలి మ్యాచ్ తో పాటు ఫైనల్ కు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫైయర్ 2 కూడా అక్కడే జరగనుండగా... తొలి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లతో క్లాష్ కాకుండా ఈ సారి షెడ్యూల్ ను రూపొందించడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. దీంతో విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ కు అందుబాటులో ఉండేలా చూసుకుంటోంది. ఈ సారి మొత్తం 66 రోజుల పాటు ఐపీఎల్ జరగనుండగా... గత ఏడాదిలానే 74 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. ఇటీవలే మెగావేలం జరగడంతో దాదాపు ప్రతీ జట్టు కూర్పు మారిపోయింది. పలు జట్లకు కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్ళు వచ్చారు. కాగా మెగా వేలంలో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు భారీ ధరకు అమ్ముడుపోయారు. రిషభ్ పంత్ 27 కోట్లు ధర పలకగా.. ఆ తర్వాత స్థానాల్లో శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ 23.75 కోట్లతో రికార్డు సృష్టించారు. మరోవైపు మహిళల ఐపీఎల్ కు సంబంధించి కూడా బీసీసీఐ నాలుగు వేదికలను ఖరారు చేసింది. ముంబయి, బెంగళూరు, బరోడా, లఖ్‌నవూలలో వుమెన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే సీజన్ నుంచి ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఐసీసీ రూల్స్ ను ఫాలో కానుంది. ఇప్పటివరకు ఐపీఎల్ తన రూల్స్ ప్రకారం నడుచుకోగా... వచ్చే సీజన్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలే అమలు చేయాలని నిర్ణయించారు.