ఐపీఎల్ మెగావేలం వీళ్ళు అమ్ముడవడం కష్టమే
ఐపీఎల్ ఆటగాళ్ళ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. రెండోసారి విదేశాల్లో నిర్వహిస్తున్న బీసీసీఐ ఈ సారి వేలం కోసం సౌదీ అరేబియన్ సిటీ జెడ్డాను ఎంపిక చేసింది. అటు రిటెన్షన్ జాబితాలను కూడా ఫ్రాంచైజీలు ప్రకటించేయడంతో పలువురు స్టార్ ప్లేయర్స్ సైతం వేలంలోకి వచ్చారు.
ఐపీఎల్ ఆటగాళ్ళ మెగావేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. రెండోసారి విదేశాల్లో నిర్వహిస్తున్న బీసీసీఐ ఈ సారి వేలం కోసం సౌదీ అరేబియన్ సిటీ జెడ్డాను ఎంపిక చేసింది. అటు రిటెన్షన్ జాబితాలను కూడా ఫ్రాంచైజీలు ప్రకటించేయడంతో పలువురు స్టార్ ప్లేయర్స్ సైతం వేలంలోకి వచ్చారు. దీంతో ఈ మెగా వేలంపై క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరికి భారీ ధర పలుకుతుంది… గత రికార్డులు బద్దలవుతాయా… యువ క్రికెటర్లలో ఎవరు జాక్ పాట్ కొడతారో అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే ఈ సారి వేలంలో కొందరు సీనియర్ ఆటగాళ్ళకు నిరాశే మిగలొచ్చు. ఎందుకంటే మెగా ఆక్షన్ కావడం, మూడేళ్ళ కాంట్రాక్ట్ ఉండనుండడంతో ఫ్రాంచైజీలు ఫామ్, వయసు కూడా చూస్తాయి. దీని ప్రకారం చూసుకుంటే కొందరు వెటరన్ ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇలా అమ్ముడుపోని ఆటగాళ్ళ జాబితాలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోవచ్చు. వరుస గాయాలు, వయసు , ఫిట్ నెస్ దృష్ట్యా అతన్ని కొనే అవకాశాలు లేనట్టేనని అంచనా వేస్తున్నారు. కేన్ మామ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సారథిగా వ్యవహరించాడు. గత సీజన్ వరకూ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉండగా.. ఇటీవలే ఆ ఫ్రాంచైజీ వేలంలోకి వదిలేసింది. విలియమ్సన్ 79 ఐపీఎల్ మ్యాచ్ లలో 2128 పరుగులు చేశాడు. అలాగే టీమిండియా సీనియర్ బ్యాటర్ అజంక్యా రహానే సైతం అమ్ముడుపోకపోవచ్చు. 2023 సీజన్ లో 326 పరుగులు , గత సీజన్ లో 242 రన్స్ చేసిన రహానేను చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి వదిలేసింది. ఎక్కువ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన రహానేను గత వేలంలో 50 లక్షలకు సీఎస్కే తీసుకుంది. కొన్ని మ్యాచ్ లలో దూకుడుగానే ఆడినప్పటకీ ఈ సారి ఫ్రాంచైజీలు అతని కోసం ప్రయత్నించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నప్పటకీ వేలానికి ముందే జరిగే రెండు మ్యాచ్ లలో ఓ రేంజ్ లో ఆడితే తప్ప అతన్ని ఫ్రాంచైజీలు తీసుకోకపోవచ్చు.
ఇదిలా ఉంటే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం అన్ సోల్డ్ గా మిగిలిపోతాడని అంచనా వేస్తున్నారు. చివరిసారిగా 2021 ఐపీఎల్ సీజన్ లో ఆడిన స్మిత్ పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించడం లేదు. ఓవరాల్ గా స్మిత్ ఐపీఎల్ రికార్డు బాగానే ఉంది. 103 ఐపీఎల్ మ్యాచ్ లలో 2485 పరుగులు చేయగా.. దీనిలో 1 సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021 ఐపీఎల్ వేలంలో స్మిత్ ను 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. వచ్చే మెగావేలం కోసం స్మిత్ కూడా తన పేరును రిజిష్టర్ చేసుకున్నాడు . కాగా ఈ ముగ్గురితో పాటు మరికొందరు విదేశీ ఆటగాళ్ళకు కూడా వేలంలో బిడ్లు రాకపోవచ్చని సమాచారం.