ఐపీఎల్ మెగా వేలం ఆ ఐదుగురి కోసం యుద్ధమే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ వేలం జరగనుంది. ఇందుకోసం ఫ్రాంఛైజీలు కూడా సిద్ధమయ్యాయి. 1500 కు పైగా రిజిస్టర్ చేసుకోగా వారిలో 574 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ వేలం జరగనుంది. ఇందుకోసం ఫ్రాంఛైజీలు కూడా సిద్ధమయ్యాయి. 1500 కు పైగా రిజిస్టర్ చేసుకోగా వారిలో 574 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు. తుది జాబితాలో భారత క్యాప్‌డ్ ప్లేయర్లు 48, విదేశీ క్యాప్‌డ్ ప్లేయర్లు 193, అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్లు 318, విదేశీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు 12 మంది ఉన్నారు. ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు వేలంలో పాల్గొననున్నారు. ఫ్రాంఛైజీలు గరిష్టంగా 204 మందిని తీసుకునే అవకాశం ఉంది. అందులో 70 మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు.
కాగా అయిదుగురు ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. వేలంలో చాలా మంది స్టార్ ప్లేయర్లున్నా చిచ్చరపిడుగు రిషబ్ పంత్ మీదే అందరి ఫోకస్ ఉంది. అతడు ఈసారి వేలం రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. వేలంలో పంత్ కోసం అన్ని జట్లు పోటీపడేందుకు సిద్ధమవుతున్నాయి. కీపింగ్‌తో పాటు అద్భుతమైన బ్యాటింగ్‌తో రిజల్ట్‌ను తారుమారు చేసే సత్తా ఉన్న ఈ పించ్ హిట్టర్ కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. అతడి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకూ కొన్ని జట్లు వెనుకాడట్లేదని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. పంత్ లాంటోడు టీమ్‌లో ఢోకా ఉండదని, అందుకే అతడ్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీ ఓనర్స్ పోటీపడుతున్నారట.
అలాగే విదేశీ ప్లేయర్స్ లో ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడు. అతడి కోసం కూడా అన్ని ఫ్రాంచైజీలు రేసులో ఉన్నాయి. ఐపీఎల్ లో ప్రతి జట్టుకు సాలిడ్ ఓపెనర్ కావాలి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కెప్టెన్సీ అవసరం ఉంది. కొన్ని జట్లకు వికెట్ కీపర్ అవసరం కూడా ఉంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా బట్లర్ ఈ మెగా ఆక్షన్ లో జాక్ పాట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టులో కీ ప్లేయర్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనింగ్ సైతం చేస్తాడు. ఐపీఎల్‌లోనూ కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. కెప్టెన్‌గా 48.43% విన్నింగ్ రేట్ ఉండటంతో ఈసారి వేలంలో ఈ టాలెంటెడ్ క్రికెటర్‌ను దక్కించుకోవడానికి చాలా ఫ్రాంఛైజీలు రెడీ అవుతున్నాయి.
మరోవైపు ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలంలో రికార్డు ధర పలికిన ఆస్టేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ వేలంలోకి వదిలేసింది. 24.75 కోట్లతో రికార్డును బద్ధలు కొట్టిన స్టార్క్ 17వ సీజన్‌లో మొదటి రెండు మూడు మ్యాచుల్లో తేలిపోయాడు. కానీ ఆ తర్వాత కీలక మ్యాచుల్లో నిప్పులు చెరిగాడు. ఎలమినేటర్ 1, ఫైనల్లో తన జోరు చూపించి కోల్‌కతా మూడోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో వేలంలో ఈ లెఫ్టార్మ్ పేసర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయమే. ఇక సఫారీ పేసర్ కగిసో రబాడా కూడా వేలంలో హాట్ టాపిక్ గా మారాడు. పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోకపోవడంతో 2 కోట్ల కనీస ధరతో వేలంలో ఉన్నాడు. రబాడా మంచి వేగంతో బంతులేయడమే కాదు నిలకడగా వికెట్లు తీయగల సామర్థ్యం కలిగిన బౌలర్. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపుతిప్ప గల పేసర్..అందుకే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయి.