వేలంలోకి ఢిల్లీ కెప్టెన్ కన్నేసిన ఫ్రాంచైజీలివే

ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ జాబితాలపై ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రాలేదు. కొందరు స్టార్ ప్లేయర్స్ ను ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలేస్తుండగా.. మరికొందరు తమ పాత ఫ్రాంచైజీలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 26, 2024 | 02:05 PMLast Updated on: Oct 26, 2024 | 2:05 PM

Ipl Teams Eye On Pant

ఐపీఎల్ మెగావేలం ముంగిట రిటెన్షన్ జాబితాలపై ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రాలేదు. కొందరు స్టార్ ప్లేయర్స్ ను ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలేస్తుండగా.. మరికొందరు తమ పాత ఫ్రాంచైజీలకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ 31 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వేలంలోకి వచ్చే అవకాశాలు దాదాపుగా ఖాయమైనట్టే.. ఫ్రాంచైజీతో పంత్ రిలేషన్ దెబ్బతినట్టు తెలుస్తోంది. తనకు ఇచ్చే రిటెన్షన్ మొత్తం విషయంలో పంత్ సంతృప్తిగా లేడని సమాచారం. 18 కోట్ల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంత్ వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వార్తలతో ఫ్రాంచైజీలు అప్రమత్తమయ్యాయి. ఈ వికెట్ కీపర్ కోసం కోట్లు కుమ్మరించేందుకు రెడీ అవుతున్నాయి.

ముఖ్యంగా పంత్ కోసం ప్రయత్నించే ఫ్రాంచైజీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుంది. డుప్లెసిస్ స్థానంలో వికెట్ కీపింగ్ కెప్టెన్ కోసం చూస్తున్న ఆర్సీబీ పంత్ ను దక్కించుకోవాలని భావిస్తోంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కూడా పంత్ కు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అలానే పంజాబ్ కింగ్స్ కూడా సరైన కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ కూడా పంత్ పైనే కన్నేసినట్టు సమాచారం. ఈ మూడు ఫ్రాంఛైజీలు వేలంలో రిషబ్ పంత్ కోసం పోటపడితే అతనికి భారీ ధర దక్కే అవకాశం ఉంది. లెప్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం, వికెట్ కీపర్, కెప్టెన్ రూపంలో అదనపు సౌలభ్యం ఉండటంతో పంత్ కోసం భారీ ధరనైనా వెచ్చించేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పటి వరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రిషబ్ పంత్ 148.93 స్ట్రైక్ రేట్‌తో 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రిషబ్ పంత్.. భారత్ జట్టులోనూ మూడు ఫార్మాట్లలో కీలకమైన ప్లేయర్‌గా ఎదిగాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లోనూ ఈ ఢిల్లీ కెప్టెన్ పరుగుల వరద పారించాడు. 13 మ్యాచ్ లలో 446 పరుగులు చేశాడు. ఇప్పుడు ఢిల్లీ ఫ్రాంచైజీ తీరుపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది. కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను నియమిస్తారన్న ప్రచారంతో పాటు రిటెన్షన్ లో 18 కోట్ల కంటే ఎక్కువ కావాలని పంత్ ఆశిస్తున్నాడు. దీనికి ఢిల్లీ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఒకవేళ పంత్ డిమాండ్ కు ఢిల్లీ ఒప్పుకోకుంటే మాత్రం ఈ యువ వికెట్ కీపర్ ఖచ్చితంగా వేలంలో భారీ ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు.