Jayaprada: హిందీ బెల్ట్ పై కేసీఆర్ “జయాస్త్రం”
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ లోకి సినీ గ్లామర్, సీనియర్ పోలిటీషియన్ చేరనున్నారు. ఆమెతో నార్త్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే పూర్తి వివరాలు చూసేయండి.
పాలిటిక్స్ లో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న జయప్రద మళ్లీ యాక్టివ్ అయ్యారు. గతంలో టీడీపీ, సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్, బీజేపీలలో పనిచేసిన అనుభవమున్న జయప్రద కు రాజకీయాల్లో మొత్తం 29 ఏళ్ల అనుభవం ఉంది. ఆమె సమాజ్ వాదీ పార్టీ తరఫున రాంపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ చేతి నుంచి సమాజ్ వాదీ పార్టీ.. అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్లిన తర్వాత జయప్రదకు ఆదరణ లభించలేదు. జయప్రద రాజకీయ గురువు అయిన అమర్ సింగ్ చనిపోవడంతో.. రాజకీయంగా ఒంటరి అయ్యారు.
కేసీఆర్, జయప్రద.. టీడీపీలో పొలిటికల్ ఓనమాలు
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. ఎన్టీ రామారావు పిలుపుతో ఆమె 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇందుకు సరిగ్గా పదేళ్ల ముందు (1983లో) కేసీఆర్ నాటి టీడీపీలో చేరి తన పొలిటికల్ కెరీర్ ను ప్రారంభించారు. ఈవిధంగా ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన జయప్రద, కేసీఆర్ మళ్లీ ఒక గూటికి చేరారు. కేసీఆర్ అధినేతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కండువాను జయప్రద కప్పుకున్నారు. బీఆర్ఎస్ లోకి చేరడానికి ముందు వరకు జయప్రద బీజేపీలో ఉన్నారు. 2019 మార్చి 26న జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఆమెకు కమల దళంలో తగిన ప్రయారిటీ లభించలేదు. ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్, బిజ్నూర్ లోక్ సభ స్థానాలపై జయప్రదకు మంచి పట్టు ఉంది. అయితే అక్కడ ఆమె సేవలను వాడుకోవడంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తి చూపించలేదు.
యూపీలో యోగి పట్టించుకోకపోవడంతో..
ఈ ఏడాది ప్రారంభంలో రాంపూర్ లోక్ సభ స్థానం పరిధిలోని సువార్ అసెంబ్లీకి జరిగిన బైపోల్ లో జయప్రద బీజేపీ టికెట్ ను ఆశించి భంగపడ్డారు. సీఎం యోగి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను కలిసినా ఆమెకు మొండి చెయ్యి దొరికింది. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించేందుకు ఉపయోగపడే కెపాసిటీ కలిగిన లీడర్స్ కోసం ప్రశాంత్ కిషోర్ ద్వారా అన్వేషణ చేయిస్తున్న కేసీఆర్ దృష్టికి జయప్రద పేరు వచ్చింది. దేశంలోని హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోకి బీఆర్ఎస్ వెళ్లాలంటే అక్కడి పాలిటిక్స్ పై, కుల సమీకరణలపై అవగాహన కలిగిన జయప్రదను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవడం మంచిదని కేసీఆర్ డిసైడ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫోకస్ మహారాష్ట్రపై ఉంటుందని.. అక్కడ తమకు అండగా నిలవాలని జయప్రదను కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని ఒక లోక్ సభ స్థానం నుంచి జయప్రదను బీఆర్ఎస్ తరఫున పోటీ చేయిస్తారని అంటున్నారు. ఒకవేళ అక్కడ గెలవలేకపోయినా రాజ్యసభకు పంపుతామనే హామీ గులాబీ దళం నుంచి ఆమెకు లభించిందని చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ పై దృష్టి పెడుతుందని.. అప్పుడు ఆ రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని జయప్రదకు బీఆర్ఎస్ నుంచి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది.