ధోనీ క్రేజే చెన్నైని ముంచేస్తోందా ? సీఎస్కేకు వార్నింగ్ బెల్స్
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చేది మొదట ధోనీనే. ధోనీ కోసమే సీఎస్కే మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి భారీగా తరలివస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత 17 ఏళ్ళుగా ధోనీ ఫాలోయింగ్ తోనే చెన్నై సూపర్ కింగ్స్ కు ఇంత క్రేజ్ వచ్చింది.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చేది మొదట ధోనీనే. ధోనీ కోసమే సీఎస్కే మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి భారీగా తరలివస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత 17 ఏళ్ళుగా ధోనీ ఫాలోయింగ్ తోనే చెన్నై సూపర్ కింగ్స్ కు ఇంత క్రేజ్ వచ్చింది. చెన్నై అభిమానులంతా ముందు ధోనీకి పిచ్చ ఫ్యాన్స్…ఇప్పుడైనా , అప్పుడైనా చెన్నై ఆడి మ్యాచ్‌లకు వస్తున్న వాళ్లంతా ధోనినీ చూడటానికే వస్తున్నారు. బ్యాటింగ్ చేస్తే, కీపింగ్‌లో మ్యాజిక్ చేస్తాడనో ఆశిస్తూ వస్తున్న వాళ్లే ఎక్కువ మంది. ఫ్యాన్స్ ఆయన్నో దేవుడిలా చూస్తున్నారు . అందుకే మొన్న రిటైర్మెంట్‌పై కామెంట్ చేసిన ధోని…. తనను చక్రాల కుర్చీలో ఉన్నా అడిస్తారేమో అన్నాడు. ధోని ఫీల్డ్‌లో ఉంటే చాలు ప్రత్యర్థులు ఎంత హడలెత్తిపోతారో తెలియదు కానీ స్టేడియంలు మాత్రం నిండిపోతాయి. టీవీలకు జనం అతుక్కుపోతున్నారు.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత వేరే చోట అతని ఆట చూసే అవకాశం కలగడం లేదు. కేవలం ఐపీఎల్ మాత్రం వేదిక అవుతుంది. అందుకే జనం ఇంతలో ధోని కోసం ఎగబడుతున్నారు. తాము అభిమానించే జట్టులో బ్యాటర్లు ఔటవ్వాలని ఎవరైనా కోరుకుంటారా… కానీ చెన్నై టాపార్డర్ ఔటైన తర్వాత మరో రెండు వికెట్లు పడితే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..,. ఎందుకంటే ధోనీ క్రీజులోకి వస్తాడని, అతని బ్యాటింగ్ మెరుపులు చూడొచ్చని… ఇది చాలు ధోనీ అంటే చెన్నై ఫ్యాన్స్ కు ఎంతో పిచ్చో చెప్పడానికి… చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్‌కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.
అతడు మైదానంలో అడుగుపెట్టాడంటే ప్రేక్షకులు ఇంకెవరినీ పట్టించుకోరు. ముఖ్యంగా తలా బ్యాట్‌తో రంగంలోకి దిగాడంటే.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమ జట్టు ఆటగాడైనా సరే అవుటై.. ధోనికి ఫినిషింగ్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్థిస్తారు. తాజాగా ధోనీ క్రేజ్ గురించి ఆ జట్టుకే ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ మానియా చెన్నైకి మంచిది కాదన్నాడు. ఈ పిచ్చి వ్యామోహం ఫ్రాంచైజీకి మంచి చేయడం కంటే చెడు ప్రభావం చూపుతుందని అంటున్నాడు. చాలా మంది అభిమానులు ధోని బ్యాటింగ్ చూడటానికే వస్తుంటారు. గత వారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ త్వరగా క్రీజులోకి వచ్చేందుకు మిగిలిన వికెట్లు పడాలని చాలా మంది కోరుకున్నారంటూ గుర్తు చేసుకున్నాడు. ధోని క్రేజ్ వల్ల ఇతర ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి తలానే స్వయంగా స్వస్తి పలకాలని రాయుడు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. ధోని ఒక్కడి చుట్టే జట్టును అభివృద్ధి చేసిన చెన్నై.. కొత్త ఆటగాళ్లకు ఇవ్వాల్సిన స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. కేవలం ధోని ఒక్కడినే నమ్ముకున్న చెన్నై యాజమాన్యం.. అతడి నిష్క్రమణ తర్వాత ఇబ్బందులపాలు కాకతప్పదని చెప్పుకొచ్చాడు.
రాయుడు చేసిన వ్యాఖ్యల్లో చాలా వరకూ నిజం ఉంది. ధోనీ క్రేజ్ ను ఎప్పుడూ క్యాష్ చేసుకునేందుకే చెన్నై ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రయత్నించింది. ధోనీ లేకుంటే తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుందేమో అన్న ఆలోచనలోనే ఇప్పటికీ ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నట్టు అర్థమవుతోంది. అందుకే ధోనీ ఆటగాడిగా ఉన్నా లేకున్నా జట్టుతో పాటే ఉంటాడని గతంలోనే చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ చాలాసార్లు చెప్పాడు. దీని ప్రకారం చూసుకుంటే ధోనీ బ్రాండ్ ను అమ్ముకోవడం ద్వారా తమ ఫ్రాంచైజీని నడిపించాలన్నదే చెన్నై మేనేజ్ మెంట్ ఆలోచన… అందుకే ఇటీవలే ధోనీ కూడా తాను వీల్ ఛైర్ లో ఉన్నా కూడా లాక్కొస్తారేమో అంటూ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ చూసిన తర్వాత ధోనీ జట్టుతో పాటే ఉండాలని చెన్నై మేనేజ్ మెంట్ ఎంత బలంగా కోరుకుంటుందో అర్థమవుతోంది. కానీ అంబటి రాయుడు అన్నట్టు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ చెన్నై జట్టును దెబ్బతీస్తుంది. మిగిలిన ఆటగాళ్ళకు అవకాశాలు రాకపోగా… వారంతా పూర్తి స్వేఛ్ఛతో ఆడలేని పరిస్థితి నెలకొంటుంది. ధోనీకి ఉన్న క్రేజ్ ను తేలిగ్గా తీసిపారేయలేం… కానీ ఈ క్రేజ్ పిచ్చి నుంచి ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచిస్తే చాలా విషయాలు ఫ్రాంచైజీ మేనేజ్ మెంట్ కు తెలుస్తాయి. ఇవి ఫ్రాంచైజీ యాజమాన్యాన్నికి ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. కానీ ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి సీఎస్కే మేనేజ్ మెంట్ ఆలోచిస్తుందా అనేదే ఇక్కడి ప్రశ్న… లైఫ్ టైమ్ ధోనీ క్రేజ్ మీదనే జట్టును నడిపిస్తామంటే మాత్రం బొక్క బోర్లా పడక తప్పదు.