Azharuddin: జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీ బరిలో అజారుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి మరకలు అంటించుకున్న మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత మహ్మ ద్ అజారుద్దీన్ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలని కలలు కంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న హైప్రొఫైల్ అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ నుంచి పోటీ శాసనసభలో అడుగుపెట్టాలని అజ్జూభాయ్ కోరుకుంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కౌంట్ డౌన్ మొదలుకావడంతో ఆశావాహులందరూ ఒక్కొక్కరిగా తెరపైకి వస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి మరకలు అంటించుకున్న మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత మహ్మ ద్ అజారుద్దీన్ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలని కలలు కంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న హైప్రొఫైల్ అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్ నుంచి పోటీ శాసనసభలో అడుగుపెట్టాలని అజ్జూభాయ్ కోరుకుంటున్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న అజారుద్దీన్ తెలంగాణ కాంగ్రెస్ టిక్కెట్ పై జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి 2009లో కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన అజారుద్దీన్.. 2014 ఎన్నికల్లో రాజస్థాన్ లోని టోంక్ సవాయ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఈసారి మాత్రం తెలంగాణ నుంచి పొలిటికల్ స్కెచ్ మొదలు పెట్టారు.
ఎలక్షన్ పిచ్ సిద్ధం చేసిన అజారుద్దీన్
జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ను ప్రిపేర్ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న రెహ్మత్ నగర్, యెల్లారెడ్డి గూడకు చెందిన ముస్లిం నేతలతో అజార్ ఇప్పటికే సమావేశమై చర్చలు జరిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో ముందుగా వాళ్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు అజార్. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ హైకమాండ్ నుంచి తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు.
వాళ్లను కాదని అజార్‌కు టిక్కెట్ ఇస్తారా ?
చిన్నా చితక పదవుల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల వరకు కాంగ్రెస్ పార్టీలో పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చాలా కీలకమైంది. పి.జనార్దన్ రెడ్డి ( పీజేఆర్) కాలంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. పీజేఆర్ మరణం తర్వాత 2009 ఎన్నికల్లో ఆయన కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. 2014 నుంచి ఈ సీటు అధికార బీఆర్ఎస్ కోటగా మారిపోయింది. మాగుంట గోపీనాథ్ ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసీటును మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలంటే.. బలమైన అభ్యర్థి అవసరం. పైగా.. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు అనేక మంది జూబ్లీహిల్స్ సీటుపై కన్నేశారు. ఇలాంటి సమయంలో అజారుద్దీన్ కు అవకాశం ఇస్తారా లేదా అన్నది రాజకీయ సమీకరణాలను బట్టి ఉంటుంది.
విష్ణు వర్సెస్ అజార్
జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నానని అజార్ ప్రకటించడంతో అప్పుడే ఆశావాహుల మధ్య వైరం మొదలయ్యింది. అజార్ తీరుపై మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్దన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా పార్టీ నేతలను, కార్యకర్తలను ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అజార్ వర్సెస్ విష్ణులా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక సర్వేలు, ఈక్వేషన్స్ తర్వాత మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ విషయంలో ఎవరిపక్షాన ఉన్నారన్నది కూడా ఆసక్తి రేపుతుంది. హైకమాండ్ కు ఆయన ఇప్పటికే అజార్ పేరును సిఫార్సు చేశారా లేక.. తనకున్న పలుకుబడి ఆధారంగా అజార్ నేరుగా ఢిల్లీ పెద్దల నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.