Chandra Babu: చంద్రబాబుకు ఆసుపత్రే జైలుగా మారనుందా..?

చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని జైలుగా మార్చి వైద్య సేవలందించేందుకు వీఐపీ బ్లాక్ ను ఏర్పాటు చేస్తున్నారా..? దీనిపై జైలు అధికారులు ఏమంటున్నారు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2023 | 01:25 PMLast Updated on: Oct 14, 2023 | 1:25 PM

Is Government Hospital Can Be Converted As Jail For Chandra Babu

చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 34 రోజులు కావొస్తోంది. అయినప్పటికీ బెయిల్ కోసం ఏర్పాటు చేసుకున్న పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పైగా ఏసీబీ కోర్టు గతంలో 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్లు చేశారు. ఆ తరువాత టీడీపీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా చంద్రబాబు అరోగ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు.

జైలు అధికారుల హెల్త్ బులిటెన్ ఇలా..

ఇలాంటి పరిస్థితుల మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ కీలకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన గతంలో కంటే ఒక కిలో బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. చిన్నపాటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి లేక రాసినట్లు చెప్పారు. వెంటనే డెర్మటాలజిస్టులను వైద్య పరీక్షల నిమిత్తం జైలుకు పంపాలని లేఖలో పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ పై పరీక్షలు జరిపిన వైద్యుల ప్రత్యేక బృందం ఆయనకు కొన్ని మందులు, లోషన్లు అందించారు. ఆ తరువాత చంద్రబాబుకు సంబంధించిన హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు రాజమండ్రి జైలు అధికారులు. అందులో టెంపరేచర్ నార్మల్, పల్స్, బీపీ కంట్రోల్లో ఉన్నట్లు రిపోర్టుల వివరాలు మీడియాకు అందించారు. అలాగే పరీక్షించిన నివేదికలను కోర్టుకు పొందుపరచనున్నారు. ఈ సీల్డ్ కవర్లో సమగ్ర నివేదిక ఆధారంగా న్యాయస్థానం ఎలా చెబితే అలా నడుచుకునే అవకాశం ఉంటుంది. అయితే న్యాయమూర్తి ఏం చెబుతారో తెలియని నేపథ్యంలో ఆవరణను శుభ్రంగా ఉంచి, ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి ఉంచినట్లు సమాచారం.

బాబును జీజీహెచ్ కు తరలిస్తారా..?

చంద్రబాబు అనారోగ్యంగా ఉన్నారన్న కథనం పై కొందరు మరో రకమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జీజీహెచ్ కు తరలిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకోసం ఒక ప్రత్యేకమైన గదిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పైగా శుక్రవారం అర్థరాత్రి నుంచి హడావుడిగా క్యాజువాలిటీ పక్కనే ఉన్న ప్రత్యేక గది ఆవరణను శుభ్రం చేశారు సిబ్బంది. ఈ ప్రత్యేక గదిలో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, అవసరమైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆసుపత్రిలో ఉండే అన్ని విభాగాల ప్రత్యేక స్పెషలిస్టులు శనివారం నుంచి అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారట. అందుకోసం ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ తో పాటూ మరో ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులను నియమించినట్లు తెలుస్తోంది.

జోరుగా రాజకీయ దుమారం..

చంద్రబాబును గత వారం ములాఖత్ లో వారి కుటుంబ సభ్యులతో పాటూ పయ్యావుల కేశవ్, నారాయణ తదితర ముఖ్యనేతలు కలిశారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. పైగా రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. ఇలాంటి పరిస్థితి జైల్లో కనిపిస్తున్నప్పుడు ఉన్నపళంగా సోషల్ మీడయాల అనారోగ్యం అంటూ ట్వీట్లు పెట్టడం ఏంటి అంటూ వైపీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అన్ని రకాలా కోర్టుల్లో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగలడంతో గద్యంతరం లేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు మండిపడుతున్నారు. పైగా బరువు తగ్గడం, డీ హైడ్రేషన్ కి గురవ్వడం, చర్మ సంబంధిత వ్యాధులు, కిడ్నీలు పాడవడం ఇలా లేని వ్యాధులను కల్పించి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఇలా టీడీపీ వాదనలకు ధీటైన ప్రతివాదనలు చేర్చుతూ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు. దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది.

 

T.V.SRIKAR