Nizamabad Parliament Elections : ఈ సారి నిజామాబాద్ కు పసుపు బోర్డు తేవడం ఖాయామా..?
రైతు ఉద్యమాలకు పుట్టినిల్లు... ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం. పసుపు బోర్డు (Yellow Board), గల్ఫ్ కుటుంబాలు(Gulf Families), నిజాం చక్కర కర్మాగారం(Nizam Chakkar Factory), బీడీ కార్మికుల సమస్యలు ఇక్కడ ఇవే ప్రధాన సమస్యలు. నిజామాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం అంతా ఈ సమస్యలపైనే నడుస్తుంది. ముఖ్యంగా ఈసారి పసుపు బోర్డు అంశం ఎన్నికల్లో ప్రధాన అస్త్రం కాబోతోంది. కేంద్రం నుంచి బోర్డును తీసుకొస్తానని హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్... ఐదేళ్ళు కాలక్షేపం చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి.
రైతు ఉద్యమాలకు పుట్టినిల్లు… ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం. పసుపు బోర్డు (Yellow Board), గల్ఫ్ కుటుంబాలు(Gulf Families), నిజాం చక్కర కర్మాగారం(Nizam Chakkar Factory), బీడీ కార్మికుల సమస్యలు ఇక్కడ ఇవే ప్రధాన సమస్యలు. నిజామాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం అంతా ఈ సమస్యలపైనే నడుస్తుంది. ముఖ్యంగా ఈసారి పసుపు బోర్డు అంశం ఎన్నికల్లో ప్రధాన అస్త్రం కాబోతోంది. కేంద్రం నుంచి బోర్డును తీసుకొస్తానని హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్… ఐదేళ్ళు కాలక్షేపం చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి అర్వింద్ టార్గెట్ గానే మిగిలిన రెండు పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రస్తుతం పోటీలో ఉన్న అర్వింద్(Dharmapuri Arvind), జీవన్ రెడ్డి(Jeevan Reddy), బాజిరెడ్డి లో.. ఈసారి నిజామాబాద్ ఓటర్లు ఎవరిని కరుణిస్తారు. ఈ ముగ్గురి మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతోంది.
నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) పోరు.. తెలంగాణ దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి…ఇప్పుడు లోక్ సభ సెగ్మెంట్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాంతో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీ అయినా… బీజేపీ(BJP) , కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్నూరు కాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు ఎక్కువ. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ, గౌడ్ ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. నిజామాబాద్ లో మొత్తం 16 లక్షల 89 వేల మంది ఓటర్లు ఉన్నారు. మహిళలే ఎక్కువ. ప్రత్యేక తెలంగాణ తర్వాత 2014 ఎన్నికల్లో…BRS నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ మధుయాష్కీ, బీజేపీ ఎండల లక్ష్మినారాయణ పోటీ పడ్డారు. ఈ పోరులో కవిత…లక్షా 67వేల ఓట్లతో గెలిచారు. 2019 ఎన్నికల్లో కవిత బీఆర్ఎస్ నుంచి, ధర్మపురి అర్వింద్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. కవితపై అర్వింద్… 70 వేల మెజార్టీ సాధించారు. నిజామాబాద్ నుంచి ఎన్నికైన ఎంపీలకు ఇప్పటి వరకు కేంద్ర మంత్రి పదవి రాలేదు.
నిజామాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో ముగ్గురు BRS… కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రైతు ఉద్యమ కేంద్రంగా ఉన్న నిజామాబాద్ లో అనేక అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. పసుపు బోర్డు, గల్ఫ్ కుటుంబాలు, నిజాం చక్కర ఫ్యాక్టరీ, బీడీ కార్మికుల సమస్యలు ప్రధాన ప్రచారాస్త్రాలు. గల్ఫ్‌కు వలస వెళ్లిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి కుటుంబాల ఓట్లు 22 శాతానికి పైగా ఉన్నట్లు అంచనా. దీంతో వారి ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. గల్ఫ్ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కార్మిక సంఘాల జేఏసీకి గౌరవాధ్యక్షుడిగా కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి ఉన్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుపై సీఎం హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దరిస్తామనీ… కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి హమీ ఇస్తున్నారు.
గత ఎన్నికల్లోనూ చక్కర ఫ్యాక్టరీ అంశం ప్రచారాస్త్రం.
ఈసారి కూడా అన్ని పార్టీలు హామిలిస్తున్నాయి. ఎంపీ అర్వింద్ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానంటున్నారు. గల్ఫ్ దేశాల్లో కార్మికులకు గౌరవం దక్కుతుందంటే… బీజేపీ, మోడీయే కారణమంటున్నారు. చెరుకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తామని అర్వింద్ హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పసుపు రైతులు 178 మంది నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. పసుపు బోర్డు తెస్తానని గతంలో ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇటీవల ప్రధానితో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయించారు. కేంద్రం గెజిట్ విడుదల చేసిందనీ.. పసుపు శుద్ది కర్మాగారాలు, ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తానని అంటున్నారు అర్వింద్. పసుపు బోర్డు పేరిట అర్వింద్ మోసం చేశారని జనంలోకి తీసుకెళ్తున్నాయి మిగతా రెండు పార్టీలు.
సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఆర్థిక బలంతో పాటు మోదీ ఛరిష్మా అడ్వాంటేజ్ అవ్వొచ్చు. అయోధ్య రామమందిరం నిర్మాణం, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటు బ్యాంక్ పెరగడం…అర్వింద్‌కు ప్లస్‌గా మారింది. గత ఎన్నికల్లో ఉన్న ముఖ్య నేతలు బీజేపీకి దూరమవడం, తన సామాజికవర్గం నేత బీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థిగా ఉండటం, అహంకారి అని జనాల్లో ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం…జీవన్‌రెడ్డికి ప్లస్‌గా మారింది. 40యేళ్ళ రాజకీయ అనుభవం, రైతు బిడ్డగా జనంలో మంచి గుర్తింపు ఆయనకు అడ్వాంటేజ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం, సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని జీవన్‌రెడ్డి లెక్కలు వేసుకున్నారు. అయితే నిజామాబాద్ లో కాంగ్రెస్ నేతల నుంచి సహకారం అంతంత మాత్రంగా ఉంటోంది. జీవన్‌రెడ్డి లేకపోతే ప్రచారానికి నేతలు ఎవరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది.
బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌కు…మాస్‌లీడర్‌గా జనంలో గుర్తింపు ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 3అసెంబ్లీ స్థానాల్లో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ కూడా భారీగా ఉండటం గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. వీటికి తోడు బలమైన మున్నూరు నేత కావడం, బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలిస్తుందని బాజిరెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం, జిల్లాలోని గులాబీ నేతల్లో ఐక్యత లేకపోవడం, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం… బాజిరెడ్డికి ప్రతికూలంగా మారాయి. నిజామాబాద్ లోక్ సభ ఓటర్లు..ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తారు. ఐతే ఈ ఎన్నికల్లో తీర్పు ఎలా ఉంటుదన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాని మోడీ మానియా పనిచేస్తుందా..? కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లాయా ?.. బీఆర్ఎస్ ను మళ్లీ ఆదరిస్తారా లేదా అన్నది త్వరలో తేలనుంది.