Pre polls in AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2023 | 10:48 AMLast Updated on: Feb 09, 2023 | 10:48 AM

Is Jagan Planning For Pre Poll Elections

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల గోల ఎక్కువయింది. అటు తెలంగాణలో అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్.. ఇటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్.. గడువు కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయ్. తెలంగాణలో గతంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగాయ్. 2018లో ముందస్తుకు వెళ్ళిన కేసీఆర్‌.. అద్భుతమైన విజయం సాధించి రెండోసారి అధికారం దక్కించుకున్నారు. ఈసారి కూడా ఆయన ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ కూడా దానికే సిద్ధం అవుతున్నాయ్.

తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో ఈసారి ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని ప్రతిపక్ష టీడీపీ అంటోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని… పూర్తిగా వ్యతిరేకత పెరగక ముందే జగన్ ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని సైకిల్ పార్టీ నేతలు అంటున్నారు. లోకేశ్ పాదయాత్ర ప్రారంభం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఖాయంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని.. కేసుల నుంచి కాసుల వరకు సీఎం జగన్‌ అనేక సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారని… అవి తనను ముంచేయక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిసైడ్ అయ్యారని కౌంటర్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు.. పూర్తిస్థాయిలో సిద్ధం అవుతున్నామని.. రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయమని… జగన్‌ రెడ్డి మాదిరిగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు చెప్పుకోవడం అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు.

మొత్తానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ భావిస్తోంది. అనుకోవడం కాదు.. నిజానికి డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే జనాల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పొత్తుల ఎత్తులు కూడా ముమ్మరం చేసింది. ఇక అటు చంద్రబాబు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎవరికి ఎక్కడ టికెట్ ఖాయమో హింట్ ఇచ్చారు. ఇక అటు వైసీపీ కూడా అదే స్పీడ్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ సర్కార్‌.. ఇప్పుడు ఇంటింటికి స్టిక్కర్ అంటోంది. అచ్చెన్నాయుడు అన్నారని కాదు కానీ.. పార్టీల అడుగులు చూస్తుంటే.. ముందస్తు ఎన్నికలు ఖాయం అనే చర్చ జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.