Kalki avatara : కల్కి అవతార్ మిస్టరీ అదేనా..

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.. కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి. ఇప్పటి వరకూ తొమ్మిది అవతారాల్లో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2024 | 03:30 PMLast Updated on: Jul 02, 2024 | 3:30 PM

Is Kalkis Avatar A Mystery

 

 

 

‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.. కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి. ఇప్పటి వరకూ తొమ్మిది అవతారాల్లో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చారు. ప్రస్తుతం న‌డుస్తోన్న క‌లియుగంలోనూ పాపాలు పెరిగిపోయాయి. దీంతో… ఈ కలియుగంలో స్వామి దర్శనమిచ్చే పదో అవతారమే ‘కల్కి’ అని పురాణాలు చెబుతున్నాయి. హిందూ మతంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం అనే నాలుగు యుగాలు ఉన్నాయని నమ్ముతారు. ఈ నాలుగు చక్రాలు మన క్యాలెండర్ నెలల మాదిరిగానే తిరుగుతాయి. ప్రస్తుతం న‌డుస్తున్న కలియుగం చివరలో విష్ణువు కల్కి అవతారంలో భూమిపైకి వస్తాడని శ్రీమద్ భాగవతం పేర్కొంది..

‘కల్కి’ అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి. వేదాలననుసరించి యుగాలు నాలుగు. అందులో మొదటిది సత్యయుగం. దీనిని కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది. ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో గడిపారు. అకాల మరణాలుండవు. రెండోది త్రేతాయుగం.. ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి, ధర్మ సంస్థాపన చేశాడు. ఇందులో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మూడోది ద్వాపరయుగం.. భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు.

ఇందులో ధర్మం రెండు పాదాలపై నడిచింది. నాలుగోది ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలు. హిందూ, బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం.. 3102 బీసీ ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైనదని చెబుతారు. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్లు పరిగణిస్తారు. ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి. కలియుగంలోనూ అంతే. ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మన నిత్య పూజా విధానంలో వచ్చే సంకల్పంలోనూ ‘కలియుగే ప్రథమ పాదే’ అని స్పష్టంగా చెప్పారు. కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి, తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్లు మన గ్రంథాలు చెబుతున్నాయి.

భాగవతం, పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రకారం కలియుంగం అంతం అవుతుందని వింటూ ఉంటాం. కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు వచ్చాయి. కొన్ని కథలు, పురాణ గాధలు ఎన్నో ఉన్నాయి. ఈ యుగం అంతమైతే.. భూమ్మీద మనుషుల మనుగడ ఉండదని వివరిస్తుంది. . అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే అంతమయ్యాయని చెబుతూ ఉంటారు. అయితే వీరభ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే కొన్ని సంకేతాలు కలియుగాంతాన్ని సూచిస్తున్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. కలియుగం అంతరించే సమయం దగ్గర్లోనే ఉందని.. జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమని వివరిస్తున్నారు. అయితే.. కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకర సంకేతాలు.. కలియుగాంతంలో చోటు చేసుకునే పరిణామాల‌పై కొన్ని అధ్యయ‌నాలు ఏం చెబుతున్నాయంటే.. కలియుగాంతం సమయంలో మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి. మనుషులకు మతం, యదార్థం, సహనం, శుభ్రత, దయ, ఆయుష్షు, శారీరక శక్తి, జ్ఞాపకశక్తి వంటివన్నీ రోజురోజుకీ తగ్గిపోతాయి. ఇవన్నీ కలియుగాంతాన్ని సూచించే పరిణామాలే.. గతంలో సంపదకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సత్ ప్రవర్తన, మంచి గుణాలకంటే సంపదకే ఎక్కువ విలువనిస్తారు. సంపన్నులే న్యాయం, చట్టాన్ని నడిపిస్తారు. కరువు, అధిక పన్నుల భారం తీవ్రంగా బాధపెడతాయి. ఆకులు, మాంసం, తేనె, పండ్లు, పూలు, గింజలు తినడం అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. కరువు కాటకాలతో అల్లాడిపోవాల్సి వస్తుంది.

అయితే.. అసలు కలియుగం ఎలా అంతమవుతుంది ? ఎవరి చేతుల్లో కలియుగం అంతం అవుతుంది అన్న విష‌యానికి వ‌స్తే.. భగవత్ గీత ప్రకారం కలియుగం ఒక వ్యక్తి, ఒక అవతారం చేతిలో అంతమవుతుంది. అంటే.. కలియుగం కల్కి అవతారంలోని విష్ణువు చేతుల్లో అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మురాదామాద్ కి చెందిన సాంభల్ గ్రామంలో కల్కి జన్మిస్తాడు.కలియుగంలో అవతరించే కల్కి చాలా శక్తివంతమైన, తెలివైన, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి.భూమిపై విష్ణువు చివరి అవతారమైన కల్కి అత్యంత శక్తివంతమైనది.

కేవలం ఆలోచన ద్వారానే ఆయుధాలు, వాహనాలను తన కళ్ల ముందు తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు కల్కి.తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ.. తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు కల్కి. తనకు కోపం వచ్చినప్పుడు చర్మ రంగు.. డార్క్ గా మారుతుంద‌ట‌. కల్కి పసుపు రంగు బట్టలను మాత్రమే ధరిస్తాడు. భూమి మీద పాపాలు, పాపులు భ‌రించ‌లేని స్థాయికి చేరుకుని.. ప్రపంచ‌మంతా క‌క‌లావిక‌లం అయిపోతున్న స‌మ‌యంలో క‌ల్కి అవ‌త‌రించి క‌లియుగాన్ని అంతం చేస్తాడ‌ని పురాణాలు చెబుతున్న మాట‌.. ఆయన అవతరించారన్నందుకు గుర్తు ఏంటంటే, పాపులందరికీ భగంధర వ్యాధి వచ్చి, రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసిన వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలను హింసించి అధికార గర్వంతో బతుకుతున్న ప్రభువులు, పాలకులను అంతం చేయడానికి శ్వేతాశ్వాన్ని ఎక్కి, కాషాయ పతాకం ధరించి ‘కల్కి’ దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి, అవతారం చాలిస్తాడు.