షమీ రీఎంట్రీ ఖాయమేనా ? ఫిట్ నెస్ పై కన్ఫ్యూజన్

భారత సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ రీఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు జాతీయ జట్టులోకి తిరిగి వస్తాడని అనుకుంటున్నా సెలక్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2025 | 02:51 PMLast Updated on: Jan 10, 2025 | 2:51 PM

Is Shamis Re Entry Certain Confusion Over Fitness

భారత సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ రీఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు జాతీయ జట్టులోకి తిరిగి వస్తాడని అనుకుంటున్నా సెలక్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిజానికి షమీ ఫిట్ నెస్ విషయంలో ఇప్పటికీ గందరగోళం కనిపిస్తోంది. ఒకవైపు రెగ్యులర్ గా దేశవాళీ టోర్నీలు ఆడుతున్నా అతని ఫిట్ నెస్ పై మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. అంటే జాతీయ జట్టులో ఆడేంత ఫిట్ నెస్ షమీ సాధించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షమీ టీమిండియాకు దూరమై ఏడాది దాటిపోయింది. 2023 వన్డే ప్రపంచకప్ లో అదరగొట్టిన ఈ సీనియర్ పేసర్ తర్వాత గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుని దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీలతో పాటు రంజీ మ్యాచ్ లు కూడా ఆడాడు. కానీ టీమిండియాలోకి మాత్రం ఎంపికవ్వలేకపోయాడు.

ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావించారు. ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు అతడిని తీసుకుంటారనే ప్రచారం సాగింది. కానీ, షమీకి మోకాలిలో వాపు రావడంతో పక్కన పెట్టారు. షమి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో లేడని బీసీసీఐ మెడికల్ టీమ్‌ తేల్చడం వల్ల అతడు స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ బీసీసీఐ సెలక్టర్లు షమీపై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేస్తారని సమాచారం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు తమ 15 మంది జాబితాను సమర్పించేందుకు 12 వరకే డెడ్ లైన్ ఉంది. దీంతో భారత జట్టుకు ఎవరు ఎంపికవుతారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల బృందం అతడిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అతడిని ఆడించాలని కూడా బీసీసీఐ భావిస్తోందట. దాదాపుగా ఈ సిరీస్ తో షమీ జాతీయ జట్టులోకి కమ్ బ్యాక్ ఇస్తాడని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్ పుర్ లో జరగనుంది. ఈ మ్యాచ్ తోనే అతడు భారత జట్టుతో కలుస్తాడని సమాచారం. మరోవైపు విజయ్ హజారే టోర్నీలో షమీ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అతను సత్తా చాటాడు. తన బౌలింగ్‌ కోటా పూర్తి చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.