TOP STORY: నిజ్జర్ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా ? విదేశాల్లో ఆపరేషన్లు చేసే సత్తా ఆ ముఠాకు ఉందా ?

భారత్, కెనడా మధ్య మరోసారి చిచ్చు రాజుకుంది. కెనడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ...ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో...తేనె తుట్టెను కదిపారు. నిజ్జర్ హత్య కేసులో భారత్ ను దోషిగా చూపెట్టి....ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు అనుసరిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2024 | 11:18 AMLast Updated on: Oct 16, 2024 | 11:18 AM

Is The Bishnoi Gang Behind Nijjars Murder

భారత్, కెనడా మధ్య మరోసారి చిచ్చు రాజుకుంది. కెనడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ…ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో…తేనె తుట్టెను కదిపారు. నిజ్జర్ హత్య కేసులో భారత్ ను దోషిగా చూపెట్టి….ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు అనుసరిస్తున్నారు. 2023 జులైలో హరదీప్ సింగ్ నిజ్జర్ ను…బ్రిటీష్ కొలంబియాలో గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా దుండగులు కాల్చి చంపారు. అయితే నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తముందంటూ ఏడాదిగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. భారత్ కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ట్రూడో…ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ నిజ్జర్ హత్యను తెరపైకి తెచ్చారు. ఈ కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మతో పాటు కొందర్ని చేర్చింది.

కొన్ని గంటలు గడిచాయో లేదో…మరో ఆరోపణ చేసింది. ఈ సారి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరును తెరపైకి తెచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి భారత ఏజెంట్లు…ఖలీస్తానీ వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుందంటూ ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్‌ బ్రిగిట్టె గౌవిన్‌ ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో…లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును కెనడా అధికారులు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. 2023లో లారెన్స్ బిష్ణోయ్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్… డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలతో అరెస్టు చేసింది. అక్కడి నుంచి తీహార్ జైలుకు తరలించింది.

ప్రస్తుతం ఈ పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ జైల్లో ఉండగా.. అతడి సోదరుడు అన్మోల్ సింగ్, గోల్డీ బ్రార్, ఇతర అనుచరులు కెనడా కేంద్రంగా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. 2023 ఆగస్టులో లారెన్స్ బిష్ణోయ్ అరెస్టయిన తర్వాత…ఖలిస్తానీ వేర్పాటు వాది సుఖ్‌దూల్ సింగ్ గిల్ అకా సుఖ దునేకే…2023 సెప్టెంబరు 21ను హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు తమదే బాధ్యతని బిష్ణోయ్ గ్యాంగ్ ఓన్ చేసింది. ఆ తర్వాత 2023 డిసెంబరు 5న కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని…జైపూర్‌లో కాల్చి చంపారు. హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, బిష్ణోయ్ ముఠా సభ్యుడు రోహిత్ గోదారా కాల్పులకు బాధ్యత వహించాడు.

కెనడా లో హత్యలకు లారెన్స్ బిష్ణోయ్ కు సంబంధం ఉంటుందా ? ప్రభుత్వం భిష్ణోయ్ ని పెయిడ్ కిల్లర్ గా వాడుతుందా ? అన్న అనుమానాలు వచ్చేలా కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీంతో అందరి కన్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పడింది. బిష్ణోయ్ జైలులో ఉండగానే నిజ్జర్, సుఖ్ దూల్ సింగ్, బాబా సిద్దిఖీ వంటి నేతలు హత్యకు గురయ్యారు. కెనడా ఆరోపణలకు బలం చేకూర్చేలా లారెన్స్ బిష్ణోయ్ వ్యవహరించింది. ఖలిస్థానీ వేర్పాటు వాది నిజ్జర్ హత్య ఆగస్టులో జరిగితే…సెప్టెంబరులో కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు సుఖ్‌దూల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే హత్యకు గురయ్యాడు. విన్నిపెగ్‌ పట్టణంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో సుఖదోల్‌ మరణించాడు. ఈ హత్య తమ పనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకుంది. ఈ కారణంగానే ఖలిస్తాన్ వేర్పాటు వాదులే లక్ష్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్…ఆపరేషన్లు చేస్తోందని…వారిని భారత్ ప్రభుత్వం కూడా వాడుకుంటోందని కెనడా ఆరోపణలు చేస్తోంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం కెనడా ఆరోపణలను కొట్టి పారేస్తోంది.