CHALO MAHARASHTRA : తెలంగాణలో జెండా పీకినట్టేనా? మహారాష్ట్ర అసెంబ్లీపై BRS నజర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్... లోక్ సభ ఎన్నికల్లోనూ బొక్క బోర్లా పడుతుందని అంటున్నారు. గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని చాలా సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ (BRS)… లోక్ సభ ఎన్నికల్లోనూ బొక్క బోర్లా పడుతుందని అంటున్నారు. గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని చాలా సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి. సరే జూన్ 4 న ఆ బండారం కూడా బయటపడుతుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వం… మహారాష్ట్రపై మళ్ళీ దృష్టిపెట్టింది. మరో నాలుగు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.
టీఆర్ఎస్ (TRS) ను బీఆర్ఎస్ (BRS) గా మార్చాక ఏపీ, మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక, ఒడిశాలో పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు కేసీఆర్ (KTR). కానీ తెలంగాణలోనే అధికారం కోల్పోవడంతో పార్టీ విస్తరణ పనులు మొన్నటిదాకా బంద్ పెట్టారు. అప్పట్లో BRSలో చేరిన కొందరు నేతలు… కేసీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పార్టీని వీడారు. పార్టీ ఆఫీసులకు అద్దె డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు 20లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయి. తెలుగువాళ్ళు ఎక్కువగా ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, కాందార్ లోహ, లాథూర్, కొల్హాపూర్ లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 300కు పైగా సర్పంచ్ లు, వార్డు సభ్యులను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అవడంతో… మహారాష్ట్ర లీడర్లు తెలంగాణ భవన్ కు వచ్చిపోతున్నారు. BRS విస్తరణపై కేసీఆర్ వారికి సూచనలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్తితో ఉన్న మహా నేతలను కూడా బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఓడి… పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను మహారాష్ట్ర జనం ఎంతవరకు నమ్ముతారన్నడి చూడాలి.